రైతులు తుపానులో.. నిరుద్యోగులు ఉప్పెనలో..

by Dishanational2 |
రైతులు తుపానులో.. నిరుద్యోగులు ఉప్పెనలో..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రైతుల బతుకు తుఫానులో, నిరుద్యోగుల బతుకు ఉప్పెనలో ఉందని, ఉద్యోగుల బతుకు సుడిగాలిలో, విద్యార్థుల బతుకు వరదల్లో కొట్టుకుపోయినా దొరకు సోయి లేకుండా పోయిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఅర్ కాందార్ సభలో చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తెలంగాణలో ఇంత జరుగుతున్నా పక్క రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ రైతుల తుపాన్ రాబోతోందని బొంకుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. తొమ్మిదేండ్లలో 9 వేల మంది తెలంగాణ రైతులు చనిపోతే పట్టించుకోలేదని విమర్శలు చేశారు. అప్పులపాలై కౌలు రైతులు ఉరికంభం ఎక్కుతుంటే ఆదుకునే తత్వ లేదని మండిపడ్డారు.

రైతులకు రుణమాఫీ, మూడెకరాల భూమి అని, పోడు పట్టాలు అని నమ్మించి గుంట నక్కలా రైతుల ఓట్లు తిన్నావని షర్మిల విరుచుకుపడ్డారు. ఇప్పుడేమో తాను రైతు నేస్తమని మొసలికన్నీరు కారుస్తున్నాడని ఫైరయ్యారు. తెలంగాణలో జనం ఛీదరించుకుంటున్నారని, అధికారం దూరం కాబోతుందని గ్రహించి జాతీయ రాజకీయాల పేరుతో ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాడని ధ్వజమెత్తారు. ఆయన ఎక్కడికి వెళ్లినా గుణపాఠం తప్పదని షర్మిల ధ్వజమెత్తారు. తెలంగాణ సంపదను దోచుకొని, దేశ సంపద కోసం బయలుదేరిన కేసీఆర్ కు ఓటమి తప్పదని ఆమె జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి పాపం పండిందని, దొరల పాలన విముక్తిని తెలంగాణ కోరుకుంటోందని ఆమె ట్వీట్ చేశారు.

తాను భారత దేశ పౌరుడినని, ఎక్కడికైనా వెళ్తా అంటూ కేసీఅర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. నిన్నటి వరకు తెలంగాణ ముద్దుబిడ్డ అని, ఇది తమ తాతల జాగీరని చెప్పుకుని తిరిగాడని ఆమె చురకలంటించారు. తనకు తప్ప ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఎవరికీ లేదని గప్పాలు చెప్పుకున్నాడని ఎద్దేవాచేశారు. ఇక దేశాన్ని దోచుకోవాలని కల రాగానే దేశ పౌరుడనే సంగతి ఇప్పుడు ఆయనకు గుర్తుకువచ్చిందని ఫైరయ్యారు. గతంలో లంకలో పుట్టినోళ్లంతా రావణ సంతతేనని, ఆంధ్రోళ్లంతా తెలంగాణ ద్రోహులేనని ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్న కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఏం సమాధానం చెబుతాడని ఆమె ప్రశ్నించారు. తాను తెలంగాణ కోడలినైనప్పటికీ ఆంధ్రా ద్రోహి అని బీఆర్ఎస్ నేతలు అవహేళన చేసినప్పుడు తాను ఈ దేశ పౌరురాలినని గుర్తుకురాలేదా? అని ఆమె ప్రశ్నించారు



Next Story