CM రేవంత్ ప్రయాణించే విమానాన్ని EC తనిఖీ చేయాలి.. BJP సంచలన డిమాండ్

by GSrikanth |
CM రేవంత్ ప్రయాణించే విమానాన్ని EC తనిఖీ చేయాలి.. BJP సంచలన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. సివిల్ సప్లై శాఖలో భారీగా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. తక్షణమే ఆ శాఖపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. స్వయంగా సీఎం నిర్వహించే సమీక్షకు మంత్రులే హాజరు కావడం లేదని అన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై రచ్చ జరుగుతుంటే సీఎం కనీసం స్పందించడం మండిపడ్డారు. ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకే మంత్రులు తహతహలాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారనే సమాచారం తమకు అందిందని.. ఆయన ప్రయాణించే విమానాన్ని ఎన్నికల సంఘం తనిఖీ చేయాలని కీలక డిమాండ్ చేశారు.


ఢిల్లీకి ముడుపులు తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. రైతుల విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మొక్కుబడిగా చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. అనేక మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించలేదన్నారు. వరికి రూ.500 బోనస్‌పై ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడటం లేదన్నారు. గతంలో కేసీఆర్ రుణమాఫీ చేస్తానని పదేళ్ల పాటు నాన్చారని.. ఇప్పటికీ రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రైతులకు రుణమాఫీ చేసేందుకు కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని.. ఆ పేరుతో అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్ఎంబీకి మించి రుణాలు తీసుకుందన్నారు. రుణమాఫీ ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వలేక పోతున్నారన్నారు.

Next Story