ప్రభుత్వ పెద్దలు మాట్లాడినా ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు: సీపీఐ

by Disha Web Desk 2 |
ప్రభుత్వ పెద్దలు మాట్లాడినా ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదు: సీపీఐ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ప్రజా గర్జన’ పేరుతో తాము నిర్వహిస్తున్న బహిరంగ సభ సమస్యలపై ప్రజలను కదిలించడం, చైతన్యం తీసుకురావడం కోసమే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాయంలో మీడియాతో మాట్లాడారు. లక్ష మందితో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేసుకున్నప్పటికీ, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 5న సభ జరిగే ప్రదేశంలోనే సింగరేణి ‘విద్యుత్ డే’ను నిర్వహిస్తుండడంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చిందన్నారు. తాము గ్రౌండ్ ఈనెల 4వ తేదీ రాత్రికి అప్పగిస్తామని చెప్పినప్పటికీ, సింగరేణి యాజమాన్యం అందుకు అంగీకరించకపోవడం అప్రజాస్వామికమని అన్నారు.

‘సీపీఐ ప్రజాగర్జన’ పేరుతో లక్ష మందితో కొత్తగూడెంలో ఈనెల 4న బహిరంగ సభ నిర్వహించుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నామని కూనంనేని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో ముందుగా అనుమతించిన సీపీఐ సభకు సింగరేణి యాజమాన్యం ఇబ్బంది కలిగించిందన్నారు. ఏదైనా ఉంటే చర్చించుకోవచ్చని, చివరకు ప్రభుత్వంలోని పెద్దలు సైతం మాట్లాడినా ఇలా వ్యవహరించడం సరైంది కాదన్నారు. అయినప్పటికీ బహిరంగ సభను అదే గ్రౌండ్స్ జూన్ 11న నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సీపీఐ కీలక భూమిక పోషించిందని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీకి ఎన్నికల నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed