దేవాలయ భూముల ఆక్రమణపై సర్కార్ సీరియస్

by Rajesh |
దేవాలయ భూముల ఆక్రమణపై సర్కార్ సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో : దేవాలయాలకు చెందిన భూముల పరిరక్షణపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఆక్రమణకు గురయ్యాయో ఆరా తీసింది. దేవాలయాలకు ఉన్న మాన్యం భూములను పరిరక్షించాలని ఆ శాఖ అధికారులను దేవాదాయ కమిషనర్ హనుమంతరావు ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో పాటు పలు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు. దేవాలయ భూములను గుర్తించేందుకు రెవెన్యూ శాఖతో కలిసి హద్దులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఆక్రమణలకు గురైన భూములను రెవెన్యూ శాఖ సాయంతో తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు. కోర్టుల్లో పిటిషన్ల విచారణతో పెండింగ్‌లో ఉన్న భూములకు సంబంధించి సకాలంలో కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని సూచించారు.

దేవాలయాలపై ప్రజలకు ఉన్న విశ్వాసంతో నిత్యం సందర్శిస్తూ ఉంటారని, రానున్న వేసవి సెలవుల్లో భారీ సంఖ్యలో కుటుంబ సమేతంగా విజిట్ చేసే అవకాశముందని సూచించిన కమిషనర్ హనుమంతరావు... ఎండను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్ళను ఏర్పాటు చేయాలని, తాగునీటి అవసరాల కోసం చలివేంద్రాలను నెలకొల్పాలన్నారు. భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని, మరోసారి ఆలయాన్ని సందర్శించేలా మౌలిక సౌకర్యాలను సమకూర్చాలన్నారు. దేవుని ప్రసాదంలో నాణ్యత విషయంలో రాజీపడొద్దన్నారు. దేవాలయాలకు సంబంధించిన ఆదాయ వ్యయాల లెక్కలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అవకతవకలు జరిగితే సహించే ప్రసక్తే లేదన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బంది విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఆలయ అర్చకులు, కిందిస్థాయి సిబ్బంది సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ వారం కార్యాలయ అధికారులు, సిబ్బంది సమీక్ష జరిగేలా క్యాలెండర్ రూపొందించుకోవాలన్నారు. ప్రతీ ఆలయంలో దాని చరిత్ర, ప్రశస్తిని తెలియజేసే సమాచారాన్ని, ఛాయాచిత్రాలతో కూడిన సమాచారాన్ని, సైన్ బోర్డులను ప్రదర్శించాలన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌లు జ్యోతి, కృష్ణవేణి, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, వివిధ స్థాయిల్లోని అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed