సీఎం కేసీఆర్‌పై Bandi Sanjay ఫైర్

by Disha Web |
సీఎం కేసీఆర్‌పై Bandi Sanjay ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక జోకర్ అని, ఆయన ఖమ్మం సభలో చెప్పిన ముచ్చట్లన్నీ తుపాకీ రాముడి ముచ్చట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవాచేశారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ తప్పా ప్రజలెవరూ బీఆర్ఎస్ సభను పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.

సభకు వచ్చిన జనాలు, నేతలెవరూ మనస్పూర్తిగా పాల్గొనలేదని, వారిని బెదిరించి సభను సక్సెస్ చేయాలని చూశారని ఆరోపించారు. కర్నాటక మాజీ సీఎం, బీహార్ సీఎం నితీశ్ కూడా రాలేదని, వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు కూడా కేసీఆర్ దగ్గర ఉన్న లిక్కర్ డబ్బులు పంచుకోవడానికి వచ్చారని ఆరోపించారు. కేసీఆర్ నోట ఏ దేశం మాట వచ్చినా ఆ దేశం సర్వనాశనం అవుతుందని, ఆయన నోటి నుంచి భారత దేశం బాగుందనే మాట రావద్దని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి ఏమన్నా అంటే పాకిస్థాన్ గురించి గొప్పలు చెబుతున్నాడని, కానీ అక్కడ పిండి గురించి కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని చురకలంటించారు. తెలంగాణలో 21 డ్యాంల నిర్మాణాలను 8 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి పెండింగులో పెడుతున్నాడని విమర్శలు చేశారు. తెలంగాణలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు.

పొలం దగ్గర ఫ్రీ కరెంట్ అని, ఇంటి దగ్గర కరెంట్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని బండి మండిపడ్డారు. డిస్కంలకు డబ్బులు కట్టకుండా ఫ్రీ కరెంట్ అంటున్నాడని, ముందు విద్యుత్ సంస్థలకు కట్టాల్సిన బకాయిలు చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఖమ్మం సభలో ఇచ్చిన స్పీచ్ గతంలో మాట్లాడిందేనని, కొత్తగా ఏం మాట్లాడలేదని తెలిపారు. వందేభారత్ ట్రైన్‌లు దేశీయంగా మేకిన్ ఇండియాలో భాగంగా తయారయ్యాయనే విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలని సంజయ్ పేర్కొన్నారు.

కేసీఆర్ వేషం, భాష, మాటలు అన్నీ తుపాకీ రాముడిలాగే ఉంటాయని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించిన సమాజ్ వాదీ పార్టీతో కేసీఆర్ జతకట్టాడని బండి ధ్వజమెత్తారు. దళితులను వంచించిన కేసీఆర్‌కు వాళ్ల గురించి మాట్లాడే హక్కు లేదని, దళితులను పారిశ్రామిక వేత్తలుగా మార్చిన ఘనత బీజేపీదేనని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ దళితులకు ఏం చేశాడో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

ఖమ్మం సభలో కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని మాట్లాడలేదని, తెలంగాణను మరిచిపోయిన కేసీఆర్‌తో జై తెలంగాణ అనిపిస్తామన్నారు. ఒక విషయంలో మాత్రం కేసీఆర్, పంజాబ్ సీఎం ఇద్దరూ ఒకటేనని, ఇద్దరూ తాగుబోతులేనన్నారు. ఖమ్మం సభకు వచ్చిన నలుగురు నేతలు నాలుగు స్కాంలలో ఉన్నారని, ఏ ఒక్క నేత బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడలేదని చురకలంటించారు. దేశంలో వచ్చేది ఆప్ ప్రభుత్వం అని కేజ్రీవాల్ ప్రకటించాడని, మరి బీఆర్ఎస్ సంగతి ఏమిటని సంజయ్ ప్రశ్నించారు.

బీఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని జర్నలిస్ట్‌లను మరోసారి వంచిస్తున్నాడని మండిపడ్డారు. కరోనా సమయంలో సహాయం కోసం అడిగిన జర్నలిస్ట్‌లను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ, అజాంజాహీ మిళ్లులను ముందు తెరిపించి, అప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడాలని సూచించారు.

అంబేద్కర్‌ను అవమానించిన, తెలంగాణ‌కు ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ ప్రజల రక్తం తాగే నరరూప రాక్షసుడు కేసీఆర్ అని బండి ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణకు ఏం చేశాడని ఆయన పుట్టినరోజున సచివాలయం ప్రారంభిస్తాడని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read....

Minister Puvvada Ajay కి సీఎం కేసీఆర్ ఫోన్
Next Story

Most Viewed