రన్నింగ్ క్వాలిఫై అభ్యర్థులకు మెయిన్స్‌కు అవకాశం ఇవ్వాలి: AIYF

by Disha Web Desk 2 |
రన్నింగ్ క్వాలిఫై అభ్యర్థులకు మెయిన్స్‌కు అవకాశం ఇవ్వాలి: AIYF
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోలీస్ నియామాకాల్లో నిర్వహించిన దేహదారుడ్య పరీక్షలో పరుగు పందెం విభాగంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ అవకాశాన్ని కల్పించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థులకు అదనపు మార్కులు జోడించాలని రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి స్వాగతిస్తూ, హర్షం వ్యక్తం చేస్తున్నదని రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కే.ధర్మేంద్ర తెలిపారు. పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రిలిమినరీ రాత పరీక్ష రాసిన వారందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకున్నదని, ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యల పరిష్కార పోరాట సమితి ఆధ్వర్యంలో యువజన, విద్యార్థి సంఘాల నేతృత్వంలో గత నెలలో చేపట్టిన నిర్విరామ పోరాట ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నదని వారు స్పష్టం చేశారు.

అదే విధంగా దేహదారుడ్య పరీక్షా విభాగాల్లో జరిగిన సమస్యలపై కూడా బోర్డు ఉదాసీనంగా వ్యవహరించాలని, పరుగు పందెం విభాగంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులందరికీ మెయిన్స్ అవకాశాన్ని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసు యూనిఫాం ధరించి రాష్ట్రానికి సేవ చేయాలనే తపన ఉన్న అభ్యర్థుల డిమాండ్లను బోర్డ్ పరిగణలోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో నిర్వహించే ఇతర పరీక్షలలో అయినా తప్పిదాలు జరగకుండా, నిరుద్యోగ యువత నష్టపోకుండా ఉండే నిర్ణయాలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నెర్లకంటి శ్రీకాంత్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సత్య ప్రసాద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ చారి పాల్గొన్నారు.


Next Story

Most Viewed