తెలంగాణ బార్డర్ దాటితే టారిఫ్ చార్జీ: RTC ఎండీ సజ్జనార్

by Satheesh |
తెలంగాణ బార్డర్ దాటితే టారిఫ్ చార్జీ: RTC ఎండీ సజ్జనార్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులతో పాటు సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుపై శుక్రవారం హైదరాబాద్ బస్ భవన్‌లో ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించి.. ఫ్రీ బస్సు జర్నీకి సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు. శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ జర్నీ స్కీమ్‌ను ప్రారంభిస్తారని.. అనంతరం రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణం మహిళలకు అందుబాటులోకి వస్తుందన్నారు.

రాష్ట్రం, కేంద్రం జారీ చేసే ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని.. అయితే వారం రోజుల పాటు ఎలాంటి ఐడెంటిటీ కార్డు అవసరం లేకుండా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. తెలంగాణ పరిధిలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేయవచ్చని, తెలంగాణ పరిధి దాటి ప్రయాణిస్తే మాత్రం టారిఫ్ ప్రకారం చార్జీ వసూలు చేస్తారన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నారో అనేదానిపై జీరో టికెట్ ఇస్తామన్నారు. దీని ద్వారా ఏ మార్గాల్లో ఎంత రద్దీ ఉందనేది తెలుసుకోవచ్చని తద్వారా సర్వీసులను పెంచే అవకాశం కూడా ఉంటుందన్నారు.

భవిష్యత్‌లో మహాలక్ష్మి స్మార్ట్ కార్డు జారీ చేసి సాప్ట్ వేర్ డెవలప్ చేస్తున్నామని త్వరలోనే వాటిని ప్రయాణికులకు అందజేస్తామన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ప్రజా రవాణా పుంజుకుంటుందని, ఈ స్కీమ్ ద్వారా మహిళల స్వయం శక్తి మెరుగవుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం చరిత్రాత్మక నిర్ణయం అని.. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు, ప్రమాదాలు తగ్గుతాయన్నారు. భవిష్యత్‌లో కొత్త బస్సులు కూడా రానున్నాయని, సంస్థలో నియామకాలు కూడా చేపట్టనున్నామన్నారు. 7200 బస్సులను ఈ పథకం కోసం వాడబోతున్నామని.. ఈ స్కీమ్ ద్వారా సంస్థకు రాబోయే రోజుల్లో రూ.3వేల కోట్ల భారం పడే అవకాశం ఉందన్నారు. ఉచిత బస్సు ప్రయాణంపై సిబ్బందికి సూచనలు చేశామని మహిళలంతా సహకరించి ఉచితంగా ప్రయాణం చేయాలని సూచించారు.



Next Story

Most Viewed