రాష్ట్రం వచ్చాక కూడా గల్ఫ్ కు వలసలు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

by Disha Web Desk 4 |
రాష్ట్రం వచ్చాక కూడా గల్ఫ్ కు వలసలు.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయిలో తెలంగాణ బిడ్డల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఎడాది దేశాలకు వలసల పరంపర ఇంకా కొనసాగడం బాధాకరమన్నారు. ప్రజల సొమ్ము దోచుకుని బుర్జ్ ఖలీఫాలో దాచుకునే పాలకులకు దుబాయ్ లో తెలంగాణ బిడ్డల బాధలు ఎలా కనిపిస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపన్నులతో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించే పాలకవర్గాలు.. సబ్బండ వర్గాల సమస్యలపై మాత్రం నిర్లక్ష్య ధోరణితోనే వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రవాసీ కార్మికుల నివాసాలను పరిశీలించారు. అక్కడ ఉన్న తెలంగాణ వాసులతో ఆయన భోజనం చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం నిర్వహించనున్న గ్లోబల్‌ బహుజన కన్వన్షన్‌లో సమగ్ర ప్రవాసీ విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. స్వరాష్ట్రంలో ఉపాధి లేకపోవడంతోనే గల్ఫ్ దేశాలకు తెలంగాణ బిడ్డలు వలసలు వస్తున్నారని అన్నారు. ఇక్కడ కొందరి వద్ద పాస్ పోర్టులు లేవని మరికొందరు గడువు ముగిసిన పాస్ పోర్టులతోనే కాలం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్భర పరిస్థితుల్లో వలక కార్మికుల బతుకులు కొనసాగుతున్నాయని అన్నారు. వీరి ఆవేదన వినే సమయం కాని హృదయం కాని పాలకులకు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story