అన్ని మతాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకే 'యువస్పృహ'.. రోహిత్ సింగ్

by Dishafeatures2 |
అన్ని మతాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకే యువస్పృహ.. రోహిత్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: అన్ని మతాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకే తాను 'యువస్పృహ'ను స్థాపించానని ఆ సంస్థ నేషనల్ కోఆర్డినేటర్ రోహిత్ సింగ్ స్పష్టం చేశారు. దేశ ప్రజలను చైతన్య పరిచి.. ప్రతి ఒక్కరిలో సమైక్యతా భావాన్ని నింపడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. అందులో భాగంగానే తాను దేశవ్యాప్త పర్యటన చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో పౌరులందరూ సమానమని ఓ వైపు రాజ్యాంగం చెబుతోందని, అలాంటప్పుడు హిందూ, ముస్లింలకు వేర్వేరు చట్టాలు ఎందుకని ప్రశ్నించారు. మన దేశం లౌకిక స్ఫూర్తితో ఉందని చెప్పుకుంటూనే అన్ని మతాలకు ఒకటే చట్టం సూత్రానికి భిన్నంగా.. మతాలకు ప్రత్యేక చట్టాలను ఆమోదించడంలో అర్థమేముందన్నారు. ఈ కారణంగానే దేశంలో కామన్ సివిల్ కోడ్ రావాల్సిన అవసరం ఉన్నదని, త్వరలోనే అది సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మోడీ పీఎం అయ్యాక దేశంలో సంస్కరణలు

నరేంద్ర మోడీ ప్రధాని తర్వాత దేశంలో సంస్కరణలు మొదలయ్యాయని రోహిత్ సింగ్ తెలిపారు. ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి లభించిందని, జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 శకం ముగిసిందని చెప్పారు. మోడీ కృషి వల్ల భారత్ విశ్వగురువుగా అవతరిస్తోందని పేర్కొన్నారు. మోడీ ఏ దేశ పర్యనటకు వెళ్ళినా అపూర్వ స్వాగతం లభిస్తోందని, ఎన్ఆర్ఐల నుంచి మోడీకి ఎనలేని ఆదరణ లభిస్తోందని తెలిపారు. మారుతున్న పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా విద్యా వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే యువతకు ఉపాధి కల్పించేలా నూతన విద్యా విధానాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. జాతీయ భాష హిందీకి మోడీ హయాంలో అత్యంత ప్రాధాన్యత లభించిందని, హిందీ మీడియంలో కూడా ఎంబీబీఎస్ కోర్సులు ఉనికిలోకి రావడం అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని రోహిత్ సింగ్ తెలిపారు.



Next Story

Most Viewed