సజ్జల మాటల వెనుక కేసీఆర్​ ప్రమేయం ఉంది : రేవంత్​రెడ్డి

by Disha Web Desk 13 |
సజ్జల మాటల వెనుక కేసీఆర్​ ప్రమేయం ఉంది : రేవంత్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయాల కోసం ఏపీ, తెలంగాణను తిరిగి కలిపే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడిన మాటలను తేలికగా తీసుకోవద్దని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి అన్నారు. సజ్జల మాటల వెనుక కేసీఆర్​ప్రమేయం ఉందని, ఆయన గైడ్​లైన్స్‌లోనే ఈ వ్యాఖ్యలు చేశారన్నారు. సజ్జల కామెంట్స్‌ను టీఆర్ఎస్ నేతలు కనీసం ఖండించలేదంటేనే అర్థం చేసుకోవాలని, ఏపీ, తెలంగాణ తిరిగి కలిసి పోతే రెండు రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చని కేసీఆర్ భావిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రమాద భీమా చెక్కుల పంపిణీ, పేదలకు బట్టల పంపిణీ, రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో, రాజీవ్​ గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో మీడియాతో రేవంత్​మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు ఏనాడూ తెలంగాణతో పేగు బంధం లేదని, టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడంతో పేరు బంధం కూడా లేకుండా పోయిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్‌గా మార్చడంపై ఎలక్షన్ కమిషన్ అభ్యంతరాలు చెప్పాలని అడిగిందని, తాను సీఈసీని కలిసేందుకు వెళితే కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, పీసీసీ చీఫ్, ఎంపీగా ఉన్న తనను కలిసేందుకు సీఈఓకు వీలుపడలేదని విమర్శించారు.

ఈ నెల 12న టీఆర్ఎస్ గులాబీ కూలీ, అవినీతి పై ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణకి వస్తోందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ కేసు విచారణకు వచ్చే ముందే ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్‌గా మార్చేసిందని, బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమిషన్.. టీఆర్ఎస్‌కి సహకరించిందని ఆరోపించారు. కోర్టు ధిక్కరణకి పాల్పడ్డ కేంద్ర ఎన్నికల కమిషన్‌పై లీగల్ ఫైట్ చేస్తామని, ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి బీఆర్ఎస్‌గా మార్చిందని, కేసు పెండింగ్‌లో ఉన్నందున పేరు మార్చేందుకు వీల్లేదన్నారు. తాను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోం మంత్రి, ఎన్నికల సంఘానికి ఆన్ లైన్ ఫిర్యాదు చేశానని రేవంత్​రెడ్డి చెప్పారు.

2017 లో బంగారు కూలీల పేరుతో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు వ్యాపారస్తుల నుంచి కోట్ల రూపాయలు బహిరంగంగా వసూలు చేశారని, బంగారు కూలీ పేరుతో వందల కోట్లు వసూలు చేసినా పార్టీ ఆ లెక్కలు ఎక్కడా చూపించలేదని అన్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో నేను కేసు వేశానని, వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు బంగారు కూలీల ఘటనపై టీఆర్ఎస్ పార్టీపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్‌కు ఆదేశాలిచ్చిందని, టీఆర్ఎస్ పార్టీ బంగారు కూలీ వసూళ్ల కేసుపై 2018లో చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలిచ్చిందని వివరించారు.

టీఆర్ఎస్ పై ఈ కేసులు పెండింగ్‌లో ఉంటే ఏ రకంగా కేంద్ర ఎన్నికల సంఘం పేరు మార్పు ప్రక్రియ పూర్తి చేస్తుందని, బీజేపీ సూచనలతోనే ఎన్నికల కమిషన్ సహకరించిందని, ఇంత మంది వ్యాపారుల మీద దాడి చేస్తున్న ఐటీ బంగారు కూలీల వ్యవహరంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితతో ఒక రకంగా మిగతా వారితో మరొ రకంగా అధికారులు ప్రవరిస్తున్నారని, గతంలో తమిళనాడు నేత కనిమొళిని విచారణకు పిలిచి ఇప్పుడు కవితతో మాత్రం ఆమె సమయం అడుగుతున్నారని, కనిమొళికి ఒక న్యాయం, కవితకు ఒక న్యాయమా అని రేవంత్​ రెడ్డి నిలదీశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఢిల్లీలో విచారణకు పిలిచి కవిత వివరణ మాత్రం ఆమె కోరుకున్న సమయానికి తీసుకుంటామనడం టీఆర్ఎస్, బీజేపీ సహకరించుకుంటున్నాయనడానికి నిదర్శనమన్నారు.

కాంగ్రెస్​ఓటు బ్యాంకును చీల్చేందుకే..!

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్‌గా మార్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి అన్నారు. దక్షిణ భారతదేశంలో బీఆర్ఎస్‌ను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, బీజేపీ కి ఆప్, ఎంఐఎం తోపాటు ఇప్పుడు మూడో మిత్రుడు చేరాడని, అదే బీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. ఆప్, ఎంఐఎం కూడా ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడానికి ఉపయోగపడుతున్నాయని, బీఆర్ఎస్‌ను కర్ణాటకలో వాడుకోవాలని బీజేపీ చూస్తోందని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేల్లో తెలిందని, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చడానికి కర్ణాటక లో బీఆర్ఎస్ ప్రయోగించాలని బీజేపీ కుట్ర చేస్తోందని, గుజరాత్ మోడల్‌ను కర్ణాటకలో అమలు చేయాలనుకుంటున్నారన్నారు.

సజ్జల వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదు..

ఏపీ వైసీపీ నేత సజ్జల మాట్లాడి 24 గంటలు గడవకముందే ఎన్నికల సంఘం కేసీఆర్‌కు పంపిన లేఖలో ఆయన చిరునామా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అని ఉందని, కేసీఆర్ ఎన్నికల సంఘానికి పెట్టుకున్న దరఖాస్తులో కూడా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అని రాశారని రేవంత్​ రెడ్డి అన్నారు. దరఖాస్తులో కేసీఆర్ పేర్కొన్న చిరునామాకే ఎన్నికల సంఘం లేఖ రాసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర మనుగడను గుర్తించడానికి కూడా కేసీఆర్ అంగీకరించడం లేదని, సజ్జల వ్యాఖ్యలకు కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఉందని, ఇది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేస్తున్న ద్రోహమన్నారు. తెలంగాణ సమాజానికి ఇది బ్లాక్ డే అని, మేధావులు, అమరుల కుటుంబాలు, తెలంగాణ సమాజం కేసీఆర్ వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని రేవంత్​రెడ్డి పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు..

ఇటీవల గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు 6 శాసనసభ స్థానాలు, యూపీలోని ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయని, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌‌లలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఢిల్లీ మున్సిపాలిటీతోపాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని రేవంత్​రెడ్డి వివరించారు. గుజరాత్‌లో ఉన్న అధికారాన్ని మాత్రమే నిలబెట్టుకుందని, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో 15 ఏళ్ల బీజేపీ పాలనను ఢిల్లీ ఓటర్లు తిరస్కరించారన్నారు.

హిమాచల్‌లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, మూడు రాష్ట్రాల్లో కేవలం ఒక రాష్ట్రంలో మాత్రమే బీజేపీ అధికారం నిలబెట్టుకుందని, 6 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచిందన్నారు. ధరలు పెంచి, నిరుద్యోగ సమస్య కు కారణవుతున్న మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని, మోడీ ఓటమి గురించి మీడియాలో రాకపోవడం దురదృష్టకరమని, బీజేపీ అనుకూల మీడియా ఈ వార్తను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తోందన్నారు.


Next Story

Most Viewed