- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తెలంగాణలో మరోసారి తెరపైకి ‘ప్రాంతీయవాదం’.. రాష్ట్రంలో మరో ఉద్యమం తప్పదా..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మళ్లీ ప్రాంతీయవాదం అంశం తెరపైకి వచ్చింది. ప్రాంతీయ అసమానతలపై అసెంబ్లీ వేదికగా శాసనసభ్యులు నిలదీస్తున్నారు. ఒక్కో నేత ఒక్కో నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఒకరు ఉత్తర తెలంగాణ అంటే మరొకరు దక్షిణ తెలంగాణ జపం చేస్తున్నారు. మరోనేత తమను ఏకంగా మహారాష్ట్రలో కలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆ నేతల వ్యాఖ్యలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రాంతీయవాదం చెలరేగడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్లే ఈ అసమానతలు పెరుగుతున్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. దీంతో తెలంగాణలో మళ్లీ కొత్త ఉద్యమాలు ఏమైనా పుట్టుకొస్తాయా? అనే ఆందోళన మొదలైంది.
నిధులు ఇవ్వకపోవడమే రీజన్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయా సెగ్మెంట్ల అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడమే ఈ ప్రాంతీయ అసమానతలకు కారణమైందని చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల సెగ్మెంట్లకే నిధులు కేటాయించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలకు చెందిన సెగ్మెంట్ల అభివృద్ధికి నిధులు కేటాయించకపోగా ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చాలని, అందుకు అన్ని విషయాల్లో కలెక్టర్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి సహకరిస్తున్నారని బహిరంగంగానే పలువురు విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌పై కూడా ఇలాంటి విమర్శలే ఉన్నాయి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లకు తప్ప ఇతర సెగ్మెంట్లకు భారీ మొత్తంలో కేటాయింపులు చేసింది లేదు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ దారిలోనే వెళ్తోందని ప్రతిపక్ష నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
అసెంబ్లీ సాక్షిగా శాసన సభ్యుల వ్యాఖ్యలు
తమ ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఉత్తర తెలంగాణ నినాదాన్ని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి ఎత్తుకున్నారు. దక్షిణ తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిందని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. తమ ప్రాంతానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని, అందుకే మహారాష్ట్రలో కలిపేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంశంలో పార్టీలకతీతంగా ముందుకెళ్లాలని పైడి రాకేశ్‌రెడ్డి ఘాటుగానే స్పందించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చానని, ఉత్తర తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రాంతానికి కూడా వాటా ఉందని, రాష్ట్ర అప్పుల్లో కూడా తన వాటా ఉందని వ్యాఖ్యానించారు. తమ సెగ్మెంట్‌కు వెళ్లి చూస్తే తెలంగాణ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.
సంచలనంగా హరీశ్‌బాబు కామెంట్స్
సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్‌బాబు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. బడ్జెట్ కేటాయింపుల్లో తమ ప్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూసిందని, తీవ్ర వివక్ష కనిపించిందని మండిపడ్డారు. తమ జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే నిధులు పెంచి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. లేదంటే తమను మహారాష్ట్రలో కలపాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారులో రైతుబంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వంటి పథకాల అమలుతో తెలంగాణ బోర్డర్‌కు సమీపంలో ఉన్న మహారాష్ట్రకు చెందిన పలు గ్రామాలను తెలంగాణలో కలపాలనే డిమాండ్లు వచ్చాయి. కానీ ఇప్పుడా సీన్ మారి తెలంగాణకు చెందిన గ్రామాలను మహారాష్ట్రలో కలపాలని కోరే స్థితికి రాష్ట్ర పరిస్థితి దాపురించిందనే విమర్శలు ప్రభుత్వంపై వస్తున్నాయి.
ప్రభుత్వంపై ఎమ్మెల్యేల ఒత్తిడి
తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పదేండ్లుగా దక్షిణ తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిందని తన గళాన్ని అసెంబ్లీలో వినిపించారు. హైదరాబాద్‌కు కూత వేటు దూరంలో ఉన్నా తమ పరిస్థితి దయనీయంగా మారిందని వివరించారు. వికారాబాద్ జిల్లా.. కోకాపేటకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, కోకాపేటలో ఒక ఎకరం రూ.వంద కోట్లకు ఉంటే.. వికారాబాద్ తలసరి ఆదాయం రూ.1 లక్షా 80 వేలు అని చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా నేతలు తమ ప్రాంత అభివృద్ధిపై నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వంపై అసెంబ్లీ సాక్షిగా ఒత్తిడి పెంచుతున్నారు. శాసనసభ్యుల నుంచి ఎదురవుతున్న విమర్శలకు చెక్ పెట్టేందుకయినా ప్రభుత్వం ఆయా సెగ్మెంట్లకు నిధులు కేటాయించి ప్రాంతీయ అసమానతలకు చెక్ పెడుతుందా? లేదా? అనేది చూడాలి.