‘KTR లేవనెత్తిన ఏ ప్రశ్నకూ మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పలేదు’

by GSrikanth |
‘KTR లేవనెత్తిన ఏ ప్రశ్నకూ మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పలేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కమార్ రెడ్డిపై సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పౌర సరఫరాల శాఖ టెండర్లలో జరిగిన అవినీతిపై కేటీఆర్ ఆధారాలతో సహా ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఆయన లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పలేదని అన్నారు. టెండర్లు పిలిచింది నిజమా? కాదా? చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.200 కోట్ల మేర టెండర్లు దక్కించుకున్న వారు కూడా ధాన్యం కొనలేదని ఉత్తమ్ చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో సబ్జెక్ట్ లేదు. ఉత్తమ్ ఆకారం పెరిగిందే కానీ ఆలోచన పెరగలేదని ఎద్దేవా చేశారు.

సన్న బియ్యం గింజ కూడా తీసుకోలేదు అంటున్నారు. అలాంటపుడు టెండర్లు ఎట్లా పిలిచారు? అని ప్రశ్నించారు. రూ.57 రూపాయలకు సన్న బియ్యం కొనాలని ప్రభుత్వమే టెండర్లలో రేటు నిర్ణయించింది నిజం కాదా? అని అడిగారు. ప్రభుత్వమే అంత రేటు నిర్ణయిస్తే బహిరంగ మార్కెట్‌లో ప్రజలపై భారం పడదా? అని మండిపడ్డారు. సైన్యంలో పనిచేసి, బార్డర్‌లో యుద్ధ విమానాలు నడిపిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆదాయం పెంచుతున్నామని చెప్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఎట్లా ఆదాయం పెంచారో చెప్పాలని అడిగారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాత్ర లేకపోతే టెండర్లు రద్దు చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ చేశారు. ప్రభుత్వ పెద్దల పాత్ర లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. టెండర్ల ఆరోపణలపై బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు.

Next Story