మంత్రి కేటీఆర్ చదువుకున్న శుంఠ: రాణిరుద్రమ ఫైర్

by Disha Web Desk 19 |
మంత్రి కేటీఆర్ చదువుకున్న శుంఠ: రాణిరుద్రమ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ చదువుకున్న శుంఠ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే పేపర్ లీకేజీ జరిగిందని ఆమె ఆరోపించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

టీఎస్ పీఎస్సీలో తప్పు జరిగితే తాను రాజీనామా చేయాలా అని మంత్రి కేటీఆర్ అంటున్నాడని, మరి బాధ్యత ఎవరు వహిస్తారని ఆమె నిలదీశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న కంప్యూటర్లు హ్యాక్ అవ్వకుండా ఉండేందుకు సైబర్ ఆడిటింగ్ ఎన్నడైనా చేపట్టారా? అని ఆమె నిలదీశారు. ఇంటర్ విద్యార్థుల చావులకు కారణమైంది కేటీఆర్ కాదా? అని ఆమె విమర్శలు గుప్పించారు. ఎలాంటి అర్హత లేకున్నా ఆయన బంధువులు, మిత్రులు కావడంతో వారికి టెండర్లు అప్పగించి విద్యార్థుల మృతికి కారకులయ్యారని ఆమె మండిపడ్డారు.

అడ్డగోలుగా సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని, అందుకే వారికి నిరుపేదల బాధలు అర్థంకావడంలేదని చురకలంటించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయని భావించి కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించినా ఇన్ని రోజులు నోటిఫికేషన్లు లేదని, ఇక ఉద్యోగం రాదనే బాధతో చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. వేసిన నోటిఫికేషన్ల ప్రశ్న పత్రాలు కూడా లీక్ చేస్తే నిరుద్యోగుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు.

టీఎస్ పీఎస్సీని లోపభూయిష్టంగా తయారుచేశారని ఆమె ధ్వజమెత్తారు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాని రేణుకకు ఉద్యోగం వచ్చిందంటేనే నియామకాలు ఏవిధంగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చని ఆమె మండిపడ్డారు. లీకేజీ విషయాన్ని రాజకీయం చేసి కేసును నీరుగార్చొద్దని ఆమె సూచించారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని, లేదంటే సీఎం కేసీఆరే.. కేటీఆర్‌ను తప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. సిట్‌తో కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.


Next Story