టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్

by Disha Web Desk 13 |
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్
X

దిశ, వికారాబాద్: పాలమూరు, రంగారెడ్డి నీళ్ల కోసం కొట్లాడకుండా, సీఎం కేసీఆర్ దగ్గర ఊడిగం చేస్తున్న దద్దమ్మలు మీ ఎమ్మెల్యేలు అని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే లపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురువారం ప్రజా ప్రస్థానం పాదయాత్రలో మద్గుల్ చిట్టెంపల్లి నుండి వికారాబాద్ పట్టణం వరకు జరిగిన పాదయాత్రలో పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలోని ముద్ద మల్లప్ప చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడారు.


వికారాబాద్ ప్రజల అభిమానం చూస్తుంటే, వైఎస్సార్ ఇంకా బ్రతికే ఉన్నాడు అనిపిస్తుంది. ముఖ్యమంత్రి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే అన్నారు. ఇప్పుడు 8 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు ఏం చేశాడు, ఉన్నఫలంగా పన్నులు పెంచడం తప్ప. అక్కడితో ఆగకుండా కొత్తగా నీటి పన్నులు వేస్తాడట. వైఎస్సార్ వికారాబాద్ కి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో 50 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని అనుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రాజెక్ట్ రీ డిజైన్ మార్చి వికారాబాద్ జిల్లా ప్రజలకు అన్యాయం చేశాడు. వైఎస్సార్ బ్రతికే ఉంటే వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు వచ్చేది. రూ.3 వేల కోట్లతో వికారాబాద్ టౌన్ ను వైఎస్సార్ శాటిలైట్ టౌన్ గా అభివృద్ధి చేసే వారని షర్మిల అన్నారు.

పాలమూరు నీళ్ల కోసం కొట్లాడని దద్దమ్మలు మీ ఎమ్మెల్యేలు..

ముఖ్యమంత్రి కేసీఆర్ అనంతగిరిలో ఔషధ ఆసుపత్రి అన్నాడు ఇచ్చాడా..? కనీసం ఉన్న టీబీ ఆసుపత్రిని పట్టించుకున్నరా..? వికారాబాద్ కి రింగ్ రోడ్ అన్నారు ఇవ్వలేదు. టెక్స్ టైల్ పార్క్ అటకెక్కించారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తి అయితే ఈ వికారాబాద్ కి నీళ్ళు వచ్చేది. వాగ్దానాలు ఇచ్చారు కానీ నీళ్లు మాత్రం రాలేదు.

రూ.17 వేల కోట్లు ఖర్చు పెట్టి కమీషన్లు తిన్నారు. పాలమూరు నీళ్ళ పై కోట్లాడని దద్దమ్మలు ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ.. రంగారెడ్డి ఎమ్మెల్యే లకు ఛాలెంజ్ విసురుతున్నాం. మీకు దమ్ముంటే, ప్రజా నాయకులు అయితే నల్ల బ్యాడ్జి తో నిరసన తెలపండి అన్నారు.

దళితుల భూములు కబ్జాలు చేస్తూ.. ఎమ్మెల్యే ఆనంద్ ఫుల్ బిజీ..

స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఒక డాక్టర్. ఈయన రూ.38 కోట్లు ఆస్తి ఉందని ఎన్నికల అఫిడవిట్ లో తెలిపారట. ఇప్పుడు వందల కోట్లు సంపాదించాడట కదా మరి. భూ కబ్జాలు, అసైన్డ్ భూములు ఆక్రమణలో ఈ ఎమ్మెల్యే దిట్ట అని తెలుస్తుంది. సర్పాన్ పల్లి వద్ద భూమి ఆక్రమించి రిసార్ట్ లు కడుతున్నారట కదా. అటువైపు అధికారులు వస్తే ట్రాన్స్‌ఫర్ చేస్తారట కదా, ప్రశ్నించిన జర్నలిస్ట్ లను అరెస్ట్ లు చేయించాడట కదా, ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకుని ఇదేనా మీరు చేసేది. దళిత ఎమ్మెల్యే అని చెప్పుకునే అర్హత ఆనంద్‌కు లేదు. మరియమ్మను లాకప్ డెత్ చేస్తే ఈ దళిత ఎమ్మెల్యే ఒక్కసారైనా మాట్లాడాడా..? కేసీఆర్ కి అసలు దళితుల మీద ప్రేమే లేదు. ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ దళితుల భూములలోనే అక్రమ నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు.


Next Story

Most Viewed