వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్నా తుర్కయంజాల్‌ ప్రజలు

by Disha Web Desk 12 |
వరుస దొంగతనాలతో బెంబేలెత్తిపోతున్నా తుర్కయంజాల్‌ ప్రజలు
X

దిశ, తుర్కయంజాల్‌: వరుస చోరీలు , క్రైమ్‌లతో తుర్కయంజాల్‌ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చేలోపే దొంగలు ఇళ్లను గుల్ల చేస్తున్నారు. ఇటు తుర్కయంజాల్‌, అటు కమ్మగూడ ఏరియాలో రోజూ ఏదోఒక చోట క్రైమ్‌ జరుగుతూనే ఉంది. రోడ్డు వెంట షాపుల్లో, ఇళ్లల్లో పట్టపగలే చోరీలు జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దొంగలు రెక్కీ నిర్వహించి ఇళ్లు, షాపుల పరిసరాల్లోనే ఉంటూ అదును చూసి చోరీలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. దీంతో బయటకు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి.

హైదరాబాద్‌ నగరానికి ఆనుకొని ఉండటం, నివాసయోగ్యంగా ఉండటంతో తుర్కయంజాల్‌ శరవేగంగా విస్తరిస్తోంది. గడచిన రెండుమూడేళ్లలోనే పట్టణ జనాభా 200 శాతానికి పైగా పెరిగింది. ఇదే సమయంలో క్రైమ్‌ రేట్‌ కూడా విపరీతంగా పెరిగిపోయింది. వరుస చోరీలు, మర్డర్లు, గొడవలు, ఇతర తగాదాలు షరా మామూలే అయిపోయాయి. ఈ క్రమంలో ఇటీవల ముగిసిన సంక్రాంతి పండుగ దొంగల పాలిట వరంగా మారింది. పండగపూట పట్టణంలో పదుల సంఖ్యలో చోరీలు జరగడం విస్మయానికి గురి చేసే విషయం. దొంగలు రెక్కీ నిర్వహించి ఇళ్లల్లోని వ్యక్తులు బయటకు వెళ్లే సమయాన్ని చూసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు.

21వ వార్డు జనచైతన్య కాలనీలో నివాసముండే కొంతం యాదిరెడ్డి ఇంట్లో పండగ పూట దొంగలు బీభత్సం సృష్టించారు. తన కుటుంబ సభ్యులతో పై అంతస్తులో ఉన్న విషయాన్ని గమనించిన దొంగలు... కింది పోర్షన్‌ను టార్గెట్‌ చేసుకుని ఇళ్లంతా గుల్లచేశారు. మరుసటి రోజు విషయం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు నందిని రెస్టారెంట్‌లో భారీ చోరీ జరిగింది. రాత్రి ఒకటిన్నర గంటల సమయంలో మూసిఉన్న రెస్టారెంట్‌లోకి దూకిన దొంగ... సుమారు రూ.85వేల నగదు, బయట పార్క్‌ చేసిన కారుతో ఉడాయించాడు. ఇదంతా సీసీ కెమెరాల్లో మొత్తం నిక్షిప్తమైంది.

రాఘవేంద్రకాలనీలోని ఓ స్టేషనరీ షాప్ లో ఓ దొంగ పట్టపగలే చోరీ చేశాడు. సదరు షాపు యజమాని... పక్కనే ఉన్న షాపులోకి పని నిమిత్తం వెళ్లాడు. ఇది గమనించిన దొంగ షాప్ గల్లపెట్టెలో అందినకాడికి పట్టుకొని పరిగెత్తాడు. ఇది గమనించిన స్థానికులు వెంట పడి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పజెప్పారు. ఆదివారం సంతలో చైన్‌స్నాచింగ్‌లు, మొబైల్‌ చోరీలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులున్నాయి. ఇక పార్క్‌ చేసిన బైక్‌లు ఇప్పటికే పదుల సంఖ్యలో మాయమయ్యాయి. కొద్దిరోజులుగా జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పట్టపగలు చోరీలకు పాల్పడుతున్న ఘటనలతో స్థానికులు ఇల్లు విడిచి బయటకు వెళ్లేందుకే జంకుతున్నారు.

పోలీసు నిఘా పెంచాలి

తుర్కయంజాల్‌ పట్టణంలో ఇండిపెండెంట్‌ ఇళ్లే టార్గెట్‌గా దొంగలు ప్రతాపం చూపుతున్నారు. చిన్న చోరీలు నిత్యకృత్యమైపోయాయి. ఫిర్యాదులు అందినప్పుడే పోలీసులు వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణం పై పోలీసు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.


Next Story

Most Viewed