- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆ ఎమ్మెల్యే ఫోన్ కాల్ తో బదిలీ..!
దిశ ప్రతినిధి, వికారాబాద్ : మీరు నిజాయితీగా పనిచేయాలి అనుకుంటున్నారా..? అయితే వికారాబాద్ జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలో మీకు చోటు లేదు. ఒకవేళ పొరపాటున రెగ్యులర్ బదిలీల్లో ఇక్కడికి వస్తేమాత్రం మల్లి అక్కడికే ట్రాన్స్ఫర్ చేస్తాం జాగ్రత్త అనేలా ఉన్నాయి ఇక్కడి పరిస్థితులు. బుధవారం వికారాబాద్ మండల ఎమ్మార్వో వహేదా ఖాతూమ్ ను కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేయడంతో, ఇది నిజమేనని మరోసారి రుజువయినట్లు అయ్యింది.
తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గం ఏదైనా అక్కడ ఉన్న అధికార పార్టీ బడా నాయకుడు, శాఖ ఏదైనా తనకు నచ్చిన అధికారిని నియమించుకునే స్వేచ్ఛను బంగారు తెలంగాణ ప్రభుత్వం బహిరంగంగానే ఇచ్చింది అనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో నిజాయితీగా కష్టపడి పనిచేసి అభివృద్ధి చేసే అధికారులను కాకుండా, చెప్పిన ప్రతిదానికి గంగిరెద్దుల్లా తల ఊపే వారికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, దాంతో అభివృద్ధి కుంటుపడుతుందని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్కడ అభివృద్ధి చేసే నాయకులు, అధికారులు కరువు..!
జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్ నిజయోజకవర్గంలో అధికారి నాలుగు కాలాల పాటు ఎలాంటి ట్రాన్స్ఫర్ లేకుండా స్వేచ్ఛగా పనిచేయాలి అంటే ప్రజా సేవా కంటే ప్రజాప్రతినిధుల సేవచేయడమే ప్రథమ బాధ్యత పనిచేయాలి. నిజాయితీగా పనిచేసే అధికారులకు ఇక్కడ చోటులేదు అనే సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో నిజాయితీగా పనిచేసిన మరో ఎమ్మార్వో, ఒక డీఎస్పీ, వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో న్యాయం వైపు నిలబడిన ఒక సీఐ, మరో ఎస్సై ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది నిజాయితీగల అధికారులు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనీ మంచి సంకల్పంతో వచ్చి, చివరికి ఏమి చేయలేని నిరుత్సహంతో బదిలీ పై వెనుదిరిగి వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు నిజాయితీగల అధికారులు సైతం అవినీతి రొచ్చులో చిక్కుకుంటున్నారు. ఈ అధికారుల ట్రాన్స్ఫర్ వెనక అధికార పార్టీకి చెందిన ఒక బడానేత ఉన్నాడని అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్.
ఈ మధ్య ఒక కార్యక్రమం అనంతరం అందరి ముందే ఫోన్ చేసిన ఆ ఎమ్మెల్యే ఎమ్మార్వో ను కావాలని ట్రాన్స్ఫర్ చేయించాడు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొరపాటున ఇది అన్యాయం కదా సార్..? అని అడిగితే మాత్రం వాళ్ళు డ్యూటీ సక్రమంగా చేయలేదు కాబట్టి వారిని ట్రాన్స్ఫర్ చేసారు. అందులో మా ప్రమేయం ఏమి ఉంటుంది అని సింపుల్గా చెప్పి తప్పించుకుంటున్న పరిస్థితి. మీ పైరవీలు చేయడం లేదనే సాకుతో అధికార పార్టీ నాయకులు పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం వేస్తే ఎలా..? అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నాయకులు, అధికారులు కరువయ్యారని, కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకొని రియల్ భూముల దగ్గర నుండి అన్ని దోచుకొని దాచుకుంటున్నారని చర్చ నడుస్తుంది.
ఎమ్మార్వో పై యాక్షన్.. సర్పంన్ పల్లి ప్రాజెక్ట్ ఆక్రమణపై నో రియాక్షన్..?
చిన్న కారణాలకే ఎమ్మార్వోను కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేసిన జిల్లా కలెక్టర్, సర్పంన్ పల్లి ప్రాజెక్ట్ ఆక్రమణ పై దిశదినపత్రికలో వరుస కథనాలు వస్తున్న రియాక్ట్ కాకపోవడం వెనక ఆంతర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి. ఒక వ్యక్తి అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ లావాని భూమిని కబ్జా చేసి, ప్రాజెక్టులో అక్రమ బోటింగ్ నిర్వహిస్తూ దాదాగిరి చేస్తుంటే అట్టి వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిజాయితీకి మారుపేరుగా నిలుస్తున్న కలెక్టర్ కు, వికారాబాద్ ఎమ్మార్వో డిప్యూటేషన్ వ్యవహారం మాయని మచ్చలా మిగిలే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సర్పంన్ పల్లి ఆక్రమణ పై స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక గ్రామస్తులు కలెక్టర్ ని కోరుతున్నారు.
నాయకుల విమర్శలు.. సామాన్య ప్రజల ప్రశంసలు..
వికారాబాద్ ఎమ్మార్వో స్థానిక నాయకులకు ఎలాంటి మర్యాద ఇవ్వకుండా వారిపట్ల దురుసుగా ప్రవర్తించింది అనే ఆరోపణలు ఉన్నప్పటికీ సామాన్య ప్రజలు మాత్రమే ఆమెను ప్రశంసించడం గమనార్హం. పని నీదా..? అయితే నా దగ్గరకు నువ్వే రావాలి. అంతేగాని మరొకరి రికమండేషన్, ముఖ్యంగా అధికార పార్టీలీడర్ల రికమండేషన్ తో వస్తే బయటకి పంపేస్తా అనడమే ఇప్పుడు ఆమె బదిలీకి ప్రధాన కారణం అయ్యింది. అంతే తప్ప ప్రభుత్వ భూములను కాపాడడంలో, రెవెన్యూ సమస్యలు ముఖ్యంగా ధరణి సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మార్వో వహేదా ఖాతూమ్ కీలక భూమిక పోషించారు.
ముఖ్యంగా మండలంలో ఎక్కడ కూడా ఎర్రమట్టి అక్రమ రవాణా చేయకుండా అడ్డుకున్నారు. దాంతో లీడర్లందరూ ప్రధాన నాయకుడికి ఫిర్యాదు చేయడంతోనే నేడు ఆమె బదిలీ అయ్యిందని ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే ఆమె స్థానంలో రేపు వచ్చే ఎమ్మార్వోను ఎలాంటి వారిని నియమించుకుంటారో స్పష్టం అవుతుందని జిల్లా కేంద్రంలో చర్చనడుస్తుంది. ఏది ఏమైనా అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా జిల్లాకలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని నిజాయితీగా పనిచేసే అధికారులకు స్వేచ్ఛను ఇచ్చి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలు కోరుతున్నారు.