ఇర్విన్ భూములపై నిఘా ఏది?

by Disha Web Desk 12 |
ఇర్విన్ భూములపై నిఘా ఏది?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ రెవెన్యూ భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు స్పష్టమైంది. రెవెన్యూ నిబంధనలకు, ధరణి పోర్టల్ నామ్స్‌కు వ్యతిరేకంగా భూ మార్పిడి జరిగింది. ఇర్విన్‌లోని కొన్ని వందల ఎకరాల భూములు రాజాతెజుకర్ కుటుంబాలపై ఉన్నట్లు ధరణిలో పొందుపర్చారు. అయితే నిబంధనల ప్రకారం ఆ భూములు వారి వారసులకు గానీ, భూ కొనుగోలుదారులకు చెందాలి. కానీ భూ యజమానులకు భూ మార్పిడి జరిగిన వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ విధంగా స్థానిక తహశీల్దార్ తప్పుడు డెత్ సర్టిఫికెట్లతో భూ మార్పిడికి పాల్పడినట్లు స్పష్టమైంది.

ఈ భూములపై జరిగిన అవతకతవకలపై క్లియర్‌గా ఏవిధంగా ఎవరి నుంచి ఎవరికి చేరిందనే విషయాలు వివరించారు. అయితే జరిగిన విధానంలోని లోపాలు బహిర్గతం కాకుండా అధికారులు ధరణిలో సరి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాజా మోహన్ కుటుంబం ద్వారా ఇతరులకు నేరుగా సక్రమించిన భూ మార్పిడిని బ్లాక్లో పెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత ఎవరి ఎవరి పేర్లపైకి భూమి చేరిందో వారిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారనే విషయాలపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ సర్వే నెంబర్లు మాయం..

ఇర్విన్ గ్రామ రెవెన్యూ పరిధిలో రాజా తెజుకర్, రాజా మోహన్ కుటుంబంపై నుంచి సక్సెషన్ పద్ధతిలో చేసుకున్న సర్వే నంబర్లకు సంబంధించిన వివరాలు మాయం చేసినట్లు తెలుస్తోంది. రాజారామకరన్ పేరు నుంచి 1414అ/1/2, 1406/2, 1406/2/1, 1414అ/1/2, 1414 అ/1/2/1, 186, 299/1, 299/1/1 సర్వే నంబర్లు ధరణిలో కనిపించడం లేదు. ఈ సర్వే నంబర్లల్లోని కొన్నింటిని బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. నేరుగా సక్సేషన్ దారి తీసిన విధానం బహిర్గతం కాకుండా ఉండేందుకు ఈ విధమైన చర్యలు అధికారులే తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సర్వే నంబర్ల ద్వారా ఒకే రోజు మూడు, నాలుగు సార్లు రిజిస్ట్రేషన్ చేసిన ఘనత స్థానిక తహశీల్దార్ కు దక్కుతుంది. ఇంత తతంగం జరిగిన తహశీల్దార్ తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

భూ వ్యాపారులైన రెవెన్యూ అధికారులు..

భూమి లావాదేవీలు చేసే వాళ్ళని రియల్ వ్యాపారం అంటారు... కానీ మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామ రెవెన్యూ పరిధిలో జరిగిన భూ బాగోతం చూస్తే రెవెన్యూ అధికారే రియల్ వ్యాపారిగా మారినట్లు తెలుస్తోంది. గతంలో కూడా అందుగుల కిషన్ రావుకు సంబంధించిన భూములను సక్సెషన్ పద్దతిలో భూ మార్పిడి చేసేందుకు పెద్ద కుట్ర జరిగింది. అప్పుడు కూడా ‘దిశ’ పత్రిక స్పందించి కథనాన్ని ప్రచురించింది.

వాస్తవానికి ఇర్విన్ గ్రామ రెవెన్యూ పరిధిలో అందుగుల కిషన్ రావు, రాజారామ్ కరన్ కుటుంబాలు ప్రస్తుతం లేవు. 40 ఏండ్లకు పైగా స్థానికంగా భూమి లేని నిరుపేదలే భూమిని సాగు చేసుకుంటున్నారు. ఆ రైతులకు న్యాయం చేయడంపై ఎవరికీ అభ్యంతరాలుండవు... కానీ రెవెన్యూ అధికారులు భూ వాటాలకు తెగించి రైతుల పేరుతో రియల్ వ్యాపారులకు అంటగట్టడమే దీని వెనుక ఉన్న అసలు కుట్ర.

తప్పించే ప్రయత్నంలో ఓ అధికారి..

ఇర్విన్ భూములపై జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఓ అధికారిని కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. అ అధికారి ఆర్డీవో స్థాయిలో ఉండి తప్పును సవరించేందుకు కుట్ర చేస్తున్నట్లు ప్రచారం. మాడ్గుల మండలంలో స్ధానిక తహశీల్ధారుతో ఆ అర్డీవోకు సంబంధాలు ఉండటంతోనే చర్యలు తీసుకోవడంలో వెనకంజ వేస్తున్నట్లు రాజకీయ నాయకుల్లో చర్చ జరుగుతుంది. ఒక వేళ ఆ అధికారిపై వేటు వేయకుంటే మాడ్గుల మండలంలో పట్టాలు పొందని రైతులందరికి సక్సెషన్ పద్దతిలోనే భూ మార్పిడి చేయాలనే డిమాండ్ వస్తోంది.

త్వరలోనే అధికార, ప్రతిపక్ష నేతలు బాధిత రైతులకు అండగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే ఇర్విన్ గ్రామంలో అందుగుల కిషన్ రావు, రాజరామకరన్ కుటుంబాలకు చెందిన భూములను ఎన్నో యేండ్లుగా సాగు చేసుకుంటున్నారు. వీరికి ఎలాంటి పట్టాలు లేవు. వీరంతా రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed