వైద్య ఆరోగ్య శాఖలో వారిదే హవా!

by Mahesh |
వైద్య ఆరోగ్య శాఖలో వారిదే హవా!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: నిబంధనలుండవ్​, నియమాలుండవ్.. కేవలం పైరవీలే ఉంటాయి. అదే రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ అని చెప్పక తప్పదు. పేద, మధ్య తరగతి కుటుంబాల ప్రజలకు ఆరాధ్య దైవంగా ఉండే శాఖ అవినీతికి అడ్డాగా మారిపోయింది. అక్కడుండే జిల్లా వైద్యాధికారి కేవలం సభలు, సమావేశాలకే పరిమితమై శాఖలో పనిచేసే సిబ్బందితో వ్యవహారమంతా చక్కబెడుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రైవేట్​ ఆసుపత్రుల్లో నిబంధనలున్నా, లేకున్నా డెమో అధికారి నుంచి ఒక్క ఫోన్​పోతే అడిగినంత ముట్ట చెప్పాల్సిందే. ఈ విధంగా రోజుకో దందా వైద్యారోగ్య శాఖలో నడుస్తున్నది. కొత్తగా ఏర్పాటు చేసుకునే ఆస్పత్రుల వద్ద, రెన్యువల్​ఆస్పత్రులతో పాటు ల్యాబ్​సెంటర్లు, క్లినిక్‌ల వద్ద ధరలు ఫిక్స్​చేసి వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రోకర్లు చేసే అవినీతితో ప్రైవేట్​ఆసుపత్రులు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ చేయడం గమనార్హం. చర్యలు తీసుకునేందుకు కూడా జిల్లా వైద్యాధికారికి పవర్స్​ లేవనే చర్చ వైద్యశాఖలో ఉంది.

విధులకు.. పనికి కుదరని పొంతన..

రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖలో డెమో అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి చేసే పనికి పొంతన లేదు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సీటుకే పరిమితమై మాట్లాడితే.. క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నా.. చర్యలు తీసుకోవాలన్నా ఆ అధికారి నిర్ణయమే ఫైనల్​అన్నట్లు ఆరోపణలున్నాయి. ఇన్ని ఆరోపణలున్న అధికారిని ఎందుకు అక్కడే విధులు నిర్వహిస్తున్నారంటే జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులకు వసూళ్లు చేసి ఇవ్వడంలో దిట్ట అనే పేరు కూడా ఉంది. ఆ అధికారి విధి ఏమిటంటే ఆరోగ్య భద్రత పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. సీజనల్​వ్యాధులపై ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేయాలి. అదేవిధంగా అందుకు అవసరమైన ప్రచార కరపత్రాలను ముద్రించాలి.

కానీ జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో ఏ సెక్షన్​ అధికారైనా ఆయన మాట చెబితే తప్ప ఫైల్​ ముందుకు కదిలే పరిస్థితి లేదన్న వాదన బలంగా ఉంది. జిల్లాలో సుమారు 800 వరకు ప్రైవేటు ఆస్పత్రులున్నట్లు సమాచారం. వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ఆస్పత్రుల నిర్వహణ ఉండాలి. కానీ ఆస్పత్రులను పర్యవేక్షించే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులే అవినీతికి పాల్పడితే.. ఇక ఆస్పత్రులు నిబంధనల ప్రకారం నడిపించి రోగులకు సౌకర్యాలు కల్పించేదెవరు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

చేతులు తడిపితే.. నిబంధనలు​ బేఖతార్‌..

ఆస్పత్రి నడిపించాలంటే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధికారుల కరుణ ఉండాల్సిందే. లేదంటే జిల్లాలో ప్రైవేటు ఆస్పత్రి నడవడం కష్టతరమంటున్నాయి యాజమాన్యాలు. పర్మిషన్‌కు వెళ్లినప్పుడు ఇంత చెల్లించాలి. రెన్యూవల్స్‌‌కు వెళ్లినప్పుడు ఇంత.. ఆస్పత్రుల పరిశీలనకు వెళ్ళినప్పుడు ఇంత.. ఇలా మూడుపులు ముట్టచెబితేనే సరి. లేదంటే ఆస్పత్రులపై చర్యలు తప్పవు. కనీసం ల్యాబ్‌ సెంటర్‌ నడిపించాలన్నా వైద్యఆరోగ్య శాఖకు ప్రసాదం పంపించాలి. లేకపోతే ఆస్పత్రి, ల్యాబ్‌ నిర్వహణలో లోపాలు వెతుకుతూ నానా సాకులు చూపుతూ తాళం వేయిస్తారు.

ఇది జిల్లాలో కొనసాగుతున్న వైద్య ఆరోగ్య శాఖ వ్యవహార తీరు. ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకొని మెడికల్‌ కౌన్సిల్​రిజిస్ట్రేషన్‌ పొందినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం రాకపోగా వైద్యఆర్యోగ శాఖ నిబంధనల మేరకు చిన్నచిన్న క్లినిక్స్‌ పెట్టుకొని నడిపిస్తున్న వారిని కూడా వదలకుండా ముక్కుపిండి వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక కార్పొరేట్‌ ఆస్పత్రులతో కుమ్మకైన అధికారులు.. నిబంధనలను గాలికి వదిలి ఇష్టానుసారంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి జిల్లాలో దాపురించింది.

ఉన్నతాధికారుల కనుసన్నల్లో వసూళ్లు..!

ఆస్పత్రుల పర్మిషన్లు, రెన్యూవల్స్‌కూ జిల్లా వైద్యఆరోగ్య శాఖ ఆమోదం అవసరం. ఇదే ఆసరాగా చేసుకొని అధికారులు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. అయితే ఈ వసూళ్లకు ప్రత్యేకంగా ఒక అధికారిని పెట్టినట్టు సమాచారం. డెమోగా విధులు నిర్వహించాల్సిన సూపరింటెండెంట్‌ స్థాయి అధికారి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రైవేట్ ఆస్పత్రులు యాజమన్యాలు ఆరోపిస్తున్నాయి. క్లినిక్‌ మొదలు కార్పొరేట్‌ ఆస్పత్రుల వరకు వరుస పెట్టి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి వైద్యఆరోగ్య శాఖ అధికారులపై ఎంక్వయిరీ చేసి.. చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు, సంఘాలు కోరుతున్నాయి.



Next Story

Most Viewed