అక్రమంగా మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by Disha Web Desk 11 |
అక్రమంగా మద్యం రవాణా చేస్తే కఠిన చర్యలు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, రాజేంద్రనగర్: అక్రమంగా మద్యం రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గోవా, హర్యానా, ఢిల్లీ, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి విమానంలో నగరానికి తరలిస్తున్న మద్యాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో శంషాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. రాజేంద్రనగర్ లోని శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ డేవిడ్ రవికాంత్ తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరాలు వెల్లడించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ తో పాటు రైలు, రోడ్డు మార్గం ద్వారా గోవా, హర్యానా, చత్తీస్ ఘడ్ తదితర రాష్ట్రాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని తీసుకొచ్చి వివిధ రకాల పార్టీలలో సరఫరా చేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించి పట్టుకున్నారని చెప్పారు.

వారం రోజుల వ్యవధిలో 80 పైగా కేసులు నమోదు చేశారని, 300 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకుని వచ్చి మన రాష్ట్రంలో సరఫరా చేయడం వల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుందన్నారు. ఇటీవల కాలంలో కొందరు వ్యక్తులు తరచూ గోవాకు వెళ్లి రావడం ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అధికారులు గుర్తించారని అన్నారు. అలా వెళ్లి వచ్చిన వారిపై నిఘా పెట్టడంతో ఈ నకిలీ మద్యం రాకెట్ వెలుగు చూసిందన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి మాత్రమే ఒక్కొక్కరికి రెండు బాటిల్స్ తెచ్చుకునేందుకు అనుమతి ఉంటుందని, కానీ ఇతర రాష్ట్రాల నుంచి దొంగ చాటుగా మద్యం తేవడానికి అవకాశం ఉండదన్నారు. అలా తీసుకువచ్చే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.



Next Story

Most Viewed