ఖాళీ జాగా కనిపిస్తే ఖతమే...!

by Dishanational1 |
ఖాళీ జాగా కనిపిస్తే ఖతమే...!
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: జిల్లాలో ఖాళీ భూమి కనిపించడమే పాపమైంది. ఆ భూమి పట్టానా, అసైన్డ్, సీలింగ్, భూధాన్​భూమినా అనే విషయాలు పక్కన పడితే... వ్యాపారానికి అనువైన స్థలమా... కాదా... పెట్టుబడి పెడితే లాభాలు గడిస్తామా లేదా అనే ఆలోచనలతో ముందుకెళ్తుతున్నారు. అదే సాధారణ రైతు భూమితో సంబంధం లేకుండా ఆరుగాలం కష్టపడి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తారు. అలాంటి రైతులకు పట్టా భూమినా, ప్రభుత్వా భూమినా అనే కుశల ప్రశ్నలు కురిపించి వేధించే రెవెన్యూ అధికారులకు పెట్టుబడిదారులు చేసే కబ్జాలు కనిపించకపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలోని షాద్​నగర్, కల్వకుర్తి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు కనిపిస్తే ఖతం చేసేందుకు రియల్​వ్యాపారులు వేటాడుతున్నారు. ఈ రియల్​వ్యాపారులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల మద్దత లభించడంతో వారి ఆగడాలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఆ భూములను కబ్జాలు చేసుకుని ఊకుంటున్నారనకుంటే తప్పే. ఆ భూములను కూడా రెవెన్యూ అధికారులు రిజిస్ట్రేషన్​ చేయడంతో ఆశ్చర్యం వేస్తుంది. ఏ రెవెన్యూ నిబంధనల ప్రకారం ప్రభుత్వ, అసైన్డ్​భూముల లావాదేవీలు నడుస్తున్నాయని ప్రచారం సాగుతుంది.

–రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్​నియోజకవర్గంలోని కొత్తూర్ మండలంలో ఖాజిగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్​6లో 13ఎకరాల 31గుంటల ప్రభుత్వ భూమిలో ఓ వ్యాపారి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టారు.

–షాద్‌నగర్​నియోజకవర్గంలోని కొందుర్గు మండలం రేగడి చిలకమర్రి గ్రామంలో సర్వే నెంబర్లలో 240,247,248,251 లలోని అసైన్డ్​భూమితోపాటు వాగును పూర్తిగా ధ్వంసం చేసి చూట్టు ప్రహరీ నిర్మించారు.

–మహేశ్వరం నియోజకవర్గంలోని రూ. వందల కోట్ల విలువైన 42 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్​181లో ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్‌కు రెవెన్యూ అధికారులే విక్రయించారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు మహేశ్వరం మాజీ తహశీల్దార్ ఆర్ పి. జ్యోతి, ఈఐపీఎల్ కన్‌స్ట్రక్షన్ యజమాని కొండపల్లి శ్రీధర్ రెడ్డిపై కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ వీడియో నెంబర్ 83/2023 కింద కేసు నమోదు అయింది.

–కల్వకుర్తి నియోజకవర్గంలోని మాడ్గుల మండలం ఇర్విన్ భూముల్లో పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ సదురు అధికారిపై చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

ఈ విధంగా రంగారెడ్డి జిల్లాలోని ప్రతి మండలంలో ప్రభుత్వ భూమిని బడావ్యాపారులు, రాజకీయ నేతలు కబ్జాలు చేస్తున్నారు. స్థానికులు ఎన్ని ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే సంస్థలను నెలకొల్పేందుకు ఇబ్బందులు తప్పవని మేధావులు, విద్యావంతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా భూ కుంభకోణం భారీగా నడుస్తుంది. ఇదంతా అధికార పార్టీకి చెందిన ప్రధాననేతల కనుసన్నలోనే కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలపై చర్యలు తీసుకునేందుకు కలెక్టర్​నుంచి మొదలు.. క్షేత్రస్ధాయిలోని రెవెన్యూ అధికారులు సైతం భయపడుతున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed