ప్రజా సంగ్రామ యాత్రతో టీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయి: బండి సంజయ్

by Disha Web Desk 13 |
ప్రజా సంగ్రామ యాత్రతో టీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయి: బండి సంజయ్
X

దిశ, షాద్ నగర్: రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రతో టీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయని, అయ్య తాగి ఫామ్ హౌస్‌‌ల పండుతాడు.. కొడుకు బరితెగించి ఊర్లపై బడి మొరుగుతారు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా నుంచి 27 వ రోజు పాదయాత్ర షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకులలో రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. రంగారెడ్డి జిల్లా స్థానిక నేతలు పెద్ద ఎత్తున బండి సంజయ్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తొమ్మిదిరేకులలో ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని.. ప్రజలు, యువత, ఉద్యోగుల త్యాగాల పునాదుల పై తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, దాని ఫలితాలను కేసీఆర్ ఆయన కుటుంబం అనుభవిస్తున్నారని విమర్శించారు.


రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవు కానీ తెలంగాణ పుణ్యాన కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు లభించాయన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి నిధులిచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదని, కేంద్ర ప్రభుత్వ వాటా లేకుండా నీవుచేస్తున్న అభివృద్ధి ఉందా అని కేసీఆర్‌కు సవాలు విసిరారు. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు పాలన అవకాశం కల్పించారని ఇప్పుడు ఒక్క ఛాన్స్ భారతీయ జనతా పార్టీకి ఇస్తే ప్రజలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని అన్నారు. ప్రజల కోసం పాదయాత్ర కాదు పొర్లుకుంటూ తిరగడానికైనా సిద్ధమేనని ఆయన అన్నారు.


పాలమూరు జిల్లాలో యాత్ర చేపడితే పాలమూరులో కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయని విమర్శించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎడారిగా మారుతుందని అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం తో పచ్చగా మారుస్తాను అని చెప్పిన కేసీఆర్ హామీ ఏమైంది..? అని ప్రశ్నించారు. జిల్లాలో ప్రాజెక్టు పనులను కుర్చీ వేసుకొని కూర్చొని కట్టిస్తాం అని చెప్పి ఎందుకు ఆ పని చేయలేదని విమర్శించారు. అసలు కేసీఆర్ తెలంగాణ వ్యక్తే కాదని, అతని మూలాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయని కేఏ పాల్ అన్నాడన్నారు.


కొవిడ్ కష్ట కాలంలో ప్రధానమంత్రి మోడీ నిర్ణయం వల్ల ఒక్క వ్యాక్సిన్‌కు ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు ఉచితంగా పంపిణీ చేశారని తెలిపారు. కేంద్రం నిధులు లేనిదే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టలేదని అని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న రైతు వేదిక, స్మశానవాటిక, బియ్యం పంపిణీ, పల్లె ప్రకృతి వనాలు ప్రతి ఒక్కదానిలో కేంద్రం నిధులు ఉన్నాయన్నారు. మే 14న తుక్కుగూడ వద్ద జరిగే బీజేపీ భారీ సభకు అమిత్ షా వస్తున్నారని ఈ కార్యక్రమానికి ప్రతి ఊరు నుండి కార్యకర్తలు ప్రజలు మహిళలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

బీజేపీలో చేరిక..

భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా తొమ్మిది రేకుల గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు బీజేపీ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన కిష్టారెడ్డి, దాసరి రవి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పల్లె ఆనంద్ సమక్షంలో బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాపయ్య గౌడ్, సుదర్శన్ రెడ్డి, దేపల్లి అశోక్ గౌడ్, డాక్టర్ విజయ్ కుమార్, నాయకులు కార్యకర్తలు వందలాది మంది భారీగా పాల్గొన్నారు.



Next Story

Most Viewed