మల్గుడ్ చెరువు బ్యూటిఫికేషన్ ఎవరి కోసం?

by Mahesh |
మల్గుడ్ చెరువు బ్యూటిఫికేషన్ ఎవరి కోసం?
X

దిశ, రాజేంద్రనగర్ : నగరానికి దగ్గరలో గల రాజేంద్రనగర్ గగన్ పహాడ్ దగ్గర గల మల్గుడ్ చెరువు సుందరీకరణకు ఓ ప్రైవేట్ సంస్థ హెచ్ఎండీఏ నుంచి దత్తత తీసుకుని బ్యూటిఫికేషన్ చేసింది. చెరువును సుందరీకరణ చేసిన సంస్థ స్థానికులను అనుమతించకుండా తమ స్వార్థానికి వినియోగించుకుంటున్నారు. లేక్ పేరు చెప్పి ప్రెస్టేజ్ సిటీ సంస్థ అధిక ధరలకు ఫ్లాట్లు, విల్లాలు విక్రయిస్తున్నారు. పునాదులు వేయకముందే కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.

97.29 ఎకరాల్లో మల్గుడ్ చెరువు

గగన్ పహాడ్ గ్రామ పరధిలో 97.29 ఎకరాల విస్తీర్ణంలో మల్గుడ్ చెరువు ఉంది. ఈ చెరువు సర్వే నంబర్ 35 నుంచి 39 వరకు, అదేవిధంగా 42 నుంచి 48 వరకు, దీంతోపాటు 335, 336 సర్వే నంబర్లలో రాజేంద్రనగర్ సర్కిల్ ప్రేమావతి డివిజన్ పరిధిలోని గగన్ పహాడ్ లో ఉంది. రికార్డులో 97 ఎకరాలు విస్తరించి ఉన్న క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. చెరువు పూర్తిగా కబ్జా అయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో, వారి నిర్లక్ష్యంతో చెరువు కబ్జా అయిందని గగన్ పహాడ్ గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇరిగేషన్ అధికారులు ఇటీవల ఓ బడా నిర్మాణ సంస్థతో చేతులు కలపడంతో చెరువు ఇతరుల చేతుల్లోకి వెళ్లిందని చెబుతున్నారు.

గత ప్రభుత్వంలో కీలక మంత్రి అండదండలతో..

గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి ప్రెస్టేజ్ సిటీ ప్రాజెక్టులో ప్రధాన పాత్ర వహించినట్లు తెలుస్తుంది. అన్నీ తానై వ్యవహరించిన సదరు మాజీ మంత్రి నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్టేజ్ సిటీకి అనుమతులు ఇప్పించినట్లు గగన్ పహాడ్ గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సదరు మంత్రి తమ వెనకాల ఉండడంతో ఇరిగేషన్, ఇతర శాఖల యంత్రాంగం జీ హుజూర్ అంటూ ఆ సంస్థకు లొంగిపోయినట్లు స్థానికులు మండిపడుతున్నారు.

స్థానికులకు నో ఎంట్రీ

మల్గుడ్ చెరువును సుందరీకరిస్తామని హెచ్ఎండీఏ తో పాటు ఇతర శాఖల నుండి అనుమతి తీసుకున్న ప్రెస్టేజ్ నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. చెరువును తమ సొంత ప్రయోజనాల కోసం అభివృద్ధి చేసింది. ప్రభుత్వ సొత్తయిన చెరువును అందరూ వినియోగించుకోవాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. సుందరీకరణ చేసిన చెరువు వద్దకు నిర్మాణ సంస్థ ప్రతినిధులు గగన్ పహాడ్ గ్రామస్తులను ఏమాత్రం అనుమతించడం లేదు. తమను అనుమతించకపోవడంతో చెరువును మరి ఎవరి కోసం అభివృద్ధి చేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సంస్థ చెరువు పేరుతో ఎక్కువ ధరకు ఫ్లాట్లు, విల్లాలు అమ్ముకుంటుందని పేర్కొంటున్నారు.

మొత్తం 4,650 ప్లాట్లు..

ప్రెస్టేజ్ సిటీ నిర్మాణ సంస్థ గగన్ పహాడ్ గ్రామంలో సుమారు 55 ఎకరాలు 4,647 ప్లాట్లు ఏర్పాటు చేసింది. దీంతో పాటు కొన్ని విలాలను సైతం నిర్మిస్తున్నది. సహజ సిద్ధమైన చెరువు 100 ఎకరాల్లో విస్తరించి ఉందని కొనుగోలుదారులను మభ్యపెట్టి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్ మినిమం ధర రూ.1.12కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. ప్లాట్లు 3, 3.5, 4 బెడ్రూంల ప్లాట్లను నిర్మించేందుకు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి 2027 లో కొనుగోలుదారులకు అప్పగించనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. 8 బ్లాకులుగా అపార్ట్మెంట్ నిర్మించనున్నారు.

ఇప్పటికే ఫిర్యాదులు అందాయి

ప్రెస్టీజ్ సిటీ ప్రాజెక్టుపై ఇప్పటికే ఫిర్యాదులు అందాయి. సర్వేయర్ మూసీ నది సర్వే విషయంలో చాలా బిజీగా ఉన్నారు. మా సిబ్బందితో కలిసి త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తాం. సర్వేయర్ తో త్వరలో చెరువు మొత్తాన్ని సర్వే చేయిస్తాం. చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ తదితర పై స్థాయిలో నివేదిక రూపొందిస్తాం. ప్రెస్టేజ్ సిటీ నిర్మాణ సంస్థ ఏమాత్రం నిబంధనలు ఉల్లంఘించినా ఉన్నతస్థాయి అధికారులకు రిపోర్టు అందజేస్తాం. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం.- తహశీల్దార్ రాములు

ఎలా నిర్మిస్తున్నారంటే..

అపార్ట్మెంట్స్ 31.14 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. అదేవిధంగా విల్లాలు 24 ఎకరాల్లో నిర్మాణం చేపడుతున్నట్లు ప్రెస్టేజ్ సిటీ నిర్మాణ సంస్థ తమ వెబ్సైట్ పేర్కొంది. 4,647 ఫ్లాట్లు, 119 విల్లాల నిర్మాణం చేపడుతున్నారు. అపార్ట్మెంట్లు 13 టవర్లలో నిర్మించనున్నారు. మొత్తం 42 అంతస్థుల్లో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 3, 4, 5 పడక గదుల చొప్పున విల్లాలను నిర్మించనున్నారు.



Next Story

Most Viewed