లోతట్టు ప్రాంతాలు జలమయం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు

by Disha Web Desk 7 |
లోతట్టు ప్రాంతాలు జలమయం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
X

దిశ, మీర్ పేట: బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షం వల్ల మీర్ పేట మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలైన లెనిన్ నగర్, ప్రశాంత్ నగర్, జనప్రియ కాలనీ, ఎంఎల్ఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో మోకాలు లోతు నీరు నిలిచింది. దీంతో అక్కడక్కడ ఇళ్లలోకి నీరుచేరుకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి ఊహించని విధంగా కురిసిన వర్షానికి మీర్ పేట ప్రధాన రహదారితో పాటు జనప్రియ కాలనీ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇళ్లలోకి వర్షం నీరు రావడంతో కాలనీ ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు.

దీనికి తోడు డ్రైనేజీ పొంగి పొర్లి మురికి నీరంతా రోడ్లపై ఏరులై పారడంతో సమస్య మరింత జఠిలమవుతోంది. వివిధ కాలనీల్లో కూడ రహదారులన్నీ గుంతలుగా ఉండటంతో నీళ్లు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా ఇబ్బందులు తప్పడం లేదని, నాలాల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాగా సమస్యలు వచ్చినప్పుడు స్థానిక మున్సిపల్ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.


Next Story

Most Viewed