నాడు క్రీడా ప్రాంగణం.. నేడు చెత్త కుప్పల మయం..

by Taduka Kalyani |

గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం ప్రస్తుతం చెత్త కుప్పలతో డంపింగ్ యార్డుగా మారడంపై మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు క్రీడా ప్రాంగణం.. నేడు చెత్త కుప్పల మయం..
X

దిశ, మొయినాబాద్ : మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామంలో పిల్లలు, యువత క్రీడల కోసం గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం ప్రస్తుతం చెత్త కుప్పలతో డంపింగ్ యార్డుగా మారడంపై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యువత క్రీడలు ఆడాల్సిన ప్రదేశంలో చెత్త పేరుకుపోవడం దురదృష్టకరమని, ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. వాణిజ్య క్రీడా ప్రాంగణం, నర్సరీని వెంటనే పునరుద్ధరించి యువతకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. నగర శివారు ప్రాంతం కావడంతో పట్టణంలోని పలు హోటల్లు, చికెన్, మటన్ వ్యర్దాలను సంచులతో నింపి రాత్రి సమయాలలో ఈ ప్రాంతంలో డంపింగ్ చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం హిమాయత్‌నగర్‌లోని డంపింగ్ యార్డును స్వయంగా పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్‌తో మాట్లాడి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఈ నెలాఖరులోపు చెత్తను పూర్తిగా తొలగించి ప్రాంగణాన్ని శుభ్రపరుస్తామని హామీ ఇచ్చారు. పిల్లల భవిష్యత్తు, యువత క్రీడా అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story