ల‌క్ష్య సాధ‌న‌కు విరుద్ధంగా నీరుగారిపోతున్న హ‌రిత‌హారం...

by Disha Web Desk 20 |
ల‌క్ష్య సాధ‌న‌కు విరుద్ధంగా నీరుగారిపోతున్న హ‌రిత‌హారం...
X

దిశ, గండిపేట్ : తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన హ‌రిత‌హారం నీరుగారిపోతుంది. ప‌ట్టుమ‌ని ప‌దిరోజులు కాకముందే హ‌రిత‌హారం కోసం నాటిన మొక్క‌ల‌ను అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల ప‌ర్య‌వేక్ష‌ణ లోపంతో దారి త‌ప్పుతుంది. హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంతో రాష్ట్రంలో వృక్ష‌సంప‌ద‌ను పెంపొందిచ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని చెప్పుకున్న ప్ర‌జా ప్ర‌తినిధులు, అధికారులు ఆ వైపుగా ఆలోచించ‌క‌పోవ‌డం బాధ‌గా ఉంది. రాష్ట్ర స్థాయిలో ప్ర‌భుత్వం వ‌నాల‌ను పెంపొందించాల‌ని చేప‌ట్టిన ఈ బృహత్క‌ర కార్య‌క్ర‌మానికి ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు తిలోద‌కాలు వ‌దిలేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది.

ఇది ఎక్క‌డో మారుమూల ప్రాంతంలో జ‌రిగింద‌ని అనుకుంటే పొర‌బ‌డినట్లే. న‌గ‌ర శివారు నార్సింగి మున్సిపాలిటీలో హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం మ‌స‌క‌బారిపోతుంది. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల నిర్ల‌క్ష్యం, అధికారుల అల‌స‌త్వం క‌నిపిస్తుండ‌టంతో ప్ర‌జ‌లు సైతం ఆవేద‌న చెందుతున్నారు. ప్ర‌భుత్వం ప‌దిరోజుల పాటు నిర్విరామంగా నిర్వ‌హించిన హ‌రిత‌హారం కార్య‌క్ర‌మం ఆ ప‌దిరోజుల‌కే ప‌రిమితం చేశారు. నాడు ప్ర‌చారం కోస‌మో, ప్ర‌భుత్వం దృష్టిలో ప‌డ‌టం కోసమో తెలీదు కాని నేడు నాటిన మొక్క‌ల‌ను సంర‌క్ష‌ణ‌ను విస్మ‌రిస్తున్నారు.

మొక్క‌లు నాటిన క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాల‌ని, వాటిని సంర‌క్షించాల‌ని హిత‌బోధ చేసిన వాగ్దానాల‌ను మ‌రిచిపోయారు. మున్సిపాలిటిలో అధికారుల నిర్ల‌క్ష్యం ప‌రాకాష్ట‌కు చేరింద‌ని ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ వృక్షసంప‌ద‌ను పెంచేలా ప్ర‌ణాళిక‌లు రూపొందించి పల్లె ప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను రూపొందించి ప్ర‌తి యేటా విడుత‌ల వారిగా హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతుంటే అది ల‌క్ష్య సాధ‌న దిశ‌గా మాత్రం చేరుకోవ‌డం లేదు. ఇప్ప‌టికైనా నార్సింగి మున్సిప‌ల్ అధికారులు స్పందించి నాటిన మొక్క‌ల‌ను సంర‌క్షించాల‌ని కోరుతున్నారు.

నిర్వాహ‌ణ‌లో లోప‌మేలా..?

ప్ర‌భుత్వం గ‌త జులై 1 నుంచి 10 వ తేదీ వ‌ర‌కు ప‌ల్లెప్ర‌గ‌తి, ప‌ట్ట‌ణప్ర‌గ‌తి, హ‌రిత‌హారం కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించింది. అందులో భాగంగా నార్సింగి మున్సిపాలిటీలో మొక్క‌లు నాటారు. విస్తృతంగా నాటిన మొక్క‌ల‌ను సంర‌క్షించాల్సిన అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిధులు వాటిని గాలికి వ‌దిలేశారు. ఈ కార్య‌క్ర‌మం పూర్తై 10 రోజులు అయ్యింది. ఈ క్ర‌మంలో వాటి సంర‌క్ష‌ణ‌ను పూర్తిగా విస్మ‌రించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. నూత‌న మొక్కలు నాట‌క‌పోయినా క‌నీసం నాటిన మొక్క‌ల‌ను అయినా సంర‌క్షించాల్సిన క‌నీస బాధ్య‌త‌ను తీసుకోక‌పోవ‌డం విడ్డూరంగా ప్ర‌జ‌లు అంటున్నారు. ఇప్ప‌టికైనా వృక్ష‌సంప‌ద‌ను పెంపొందించ‌డంలో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ప్ర‌త్యేకంగా చొర‌వ చూపాల‌ని కోరుతున్నారు.



Next Story

Most Viewed