శంషాబాద్ విమానాశ్రయం నుంచి నోక్ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం..

by Disha Web Desk 20 |
శంషాబాద్ విమానాశ్రయం నుంచి నోక్ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభం..
X

దిశ, శంషాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తొలిసారిగా నోక్ ఎయిర్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. భారతీయ మార్కెట్లోకి అడుగు పెట్టిన నోక్ ఎయిర్‌కు హైదరాబాద్ భారతదేశపు మొట్టమొదటి, ఏకైక గమ్యస్థానం. ప్రారంభ విమానం బుధవారం 00.40 గంటలకు హైదరాబాద్ నుండి డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. కొత్త మార్గంలో నోక్ ఎయిర్ సర్వీసు 737మ్యాక్స్ 8 విమానాన్ని నడుపుతుంది. నోక్ ఎయిర్ విమాన సర్వీసులు వారానికి మూడుసార్లు ఉంటాయి.

నాన్‌స్టాప్ ఫ్లైట్ (DD- 958) హైదరాబాద్ విమానాశ్రయానికి రాత్రి 23.45 గంటలకు చేరుకుని, హైదరాబాద్ నుండి తిరిగి 00.45 గంటలకు బయలుదేరుతుంది. హైదరాబాద్ విమానాశ్రయం నుండి థాయ్‌లాండ్‌కు నేరుగా విమానాలు నడుపుతున్న రెండవ అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇది. నోక్ ఎయిర్ డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి థాయ్‌లాండ్‌లోని అనేక పర్యాటక ప్రాంతాలను కలుపుతుంది. ప్రస్తుతం థాయ్ ఎయిర్ విమాన సర్వీసులు హైదరాబాద్ నుండి సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయం, బ్యాంకాక్‌కు ప్రతీ రోజూ నడుస్తున్నాయి.

ఎయిర్‌పోర్ట్ సీఈఓ ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ భారతదేశంలో నోక్ ఎయిర్‌ సర్వీసులు మొదటగా ఈ విమానాశ్రయంతోనే ప్రారంభం కావడం మాకు గర్వకారణమన్నారు. థాయ్‌లాండ్ భారతీయులకు అత్యంత ఇష్టమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటన్నారు. విమానాశ్రయ విస్తరణ త్వరలో పూర్తి కానున్నందున, అంతర్జాతీయ క్యారియర్‌లతో ప్రయాణికుల మరిన్ని గమ్యస్థానాలకు సర్వీసులను ప్రారంభించడానికి, మరిన్ని అంతర్జాతీయ గమ్యస్థానాలకు కనెక్టివిటీని పెంచడడంపై మేము దృష్టి పెడుతున్నామన్నారు.

Next Story