మంత్రి ప్రోగ్రాంలో ఆందోళన చేశారని శిక్ష అమలు..!

by Sumithra |
మంత్రి ప్రోగ్రాంలో ఆందోళన చేశారని శిక్ష అమలు..!
X

దిశ ప్రతినిధి, వికారాబాద్, తాండూర్ : అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గత కొన్ని రోజులుగా నిరసన దీక్షలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం తాండూర్ పట్టణంలో జరిగిన భారీ బహిరంగ సభలో మంత్రి హరీష్ మాట్లాడుతుండగా జిల్లా అంగన్వాడీలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇంటలిజెన్స్ వర్గాల వైఫల్యాన్ని పోలీసులు జీర్ణించుకోలేక తమకు తెలియకుండా సభా ప్రాంగణంలోకి వెళ్లారన్న కోపంతో తమపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని బాధిత అంగన్వాడీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పూర్తి వివరాలకు వెళ్తే మంత్రి హరీష్ రావు, జిల్లా మంత్రి పట్నం మహేందర్ రెడ్డిలు పాల్గొన్న బహిరంగ సభ ప్రాంగణంలో మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆందోళన చేపట్టిన అంగన్వాడీలు సభ అనంతరం తాము వచ్చిన డీసీఎంలో ఇంటికి వెళ్తున్నారు.

ఇది గమనించిన పోలీసులు తాండూర్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప దగ్గర వాహనాన్ని అడ్డగించి వారిని బలవంతంగా కిందికి దించి కక్ష సాధింపు చర్యలు చేపట్టారని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. స్థానిక సీఐ మహిళలని కూడా చూడకుండా బూతులు తిట్టాడని, మా కుటుంబంలో కూడా పోలీసులు ఉన్నారు కానీ మేము ఇలాంటి తప్పుడు బుద్ధులు నేర్పలేదని ఓ అంగన్వాడి మహిళ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా ప్రజలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. వారి సమస్య చెప్పుకోవడం తప్పు ఎలా అవుతుందని, మంత్రి ప్రోగ్రాంలో ఆందోళన చేసిన అంత మాత్రాన, అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలికి వారి దగ్గర క్రెడిట్ కొట్టేయడానికి ఇలా మహిళలు అని చూడకుండా అంగన్వాడీలను ఇబ్బంది పెట్టడం సిగ్గుచేటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. తాండూర్ పోలీసుల తీరు చూస్తుంటే వీళ్ళు ప్రభుత్వ నిబంధన ప్రకారం డ్యూటీలు చేస్తున్నారా..? లేక అధికార పార్టీ నాయకుల దగ్గర ఊడిగం చేస్తున్నారా..? అర్థమవుతుందని ప్రతిపక్ష నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను వివిధ పార్టీల నాయకులు ఖండించారు.
Next Story

Most Viewed