నీ ఇష్టంతో పనిలేదు...నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దు

by Sumithra |
నీ ఇష్టంతో పనిలేదు...నాకు దక్కనిది ఎవరికీ దక్కొద్దు
X

దిశ, తుర్కయంజాల్‌ : ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధి మన్నెగూడలో డెంటల్‌ డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌ వ్యవహారం సినిమా థ్రిల్లర్‌ను తలపించింది. రెండు రోజుల హైడ్రామా అనంతరం 32 మంది నిందితులను పోలీసులు జైలుకు పంపారు. వైశాలి ఇష్టంతో పనిలేకుండా ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలన్న దుర్భుద్దే కిడ్నాప్‌ వరకు దారి తీసినట్లు అర్థమవుతోంది.

'కెరీర్‌ నాశనం చేయాలనుకున్నాడు'

శనివారం సాయంత్రం తన నివాసంలో వైశాలి మీడియాతో మాట్లాడుతూ ననీన్‌రెడ్డితో పరిచయం ఉన్న మాట వాస్తవమే కానీ, అది ప్రేమ కాదన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్‌ బుచ్చిరెడ్డి ద్వారా నవీన్‌రెడ్డి పరిచయమయ్యాడని తెలిపారు. తనతో ఒంటరిగా ఎప్పుడూ, ఎక్కడికీ వెళ్లలేదని, ఫ్యామిలీ టూర్‌లో భాగంగానే వెళ్లామన్నారు. నవీన్‌రెడ్డి తనను ప్రేమిస్తున్నట్టు చెప్పగానే నో చెప్పానని, అప్పటి నుంచి కక్ష పెంచుకొని, ఎలాగైనా నా కెరీర్‌ నాశనం చేయాలని చూశాడని పేర్కొన్నారు. ఫేక్‌ ఐడీలతో ఇన్‌స్టాగ్రామ్‌, ఇంటర్నెట్‌లో ఫొటోలు మార్పింగ్‌ చేసి పెట్టాడన్నారు. నవీన్‌రెడ్డితో పెళ్లయిందని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని తెలిపారు. నాకు నువ్వంటే ఇష్టంలేదని చెప్పినా కూడా వినలేదని, నీ ఇష్టంతో నాకు పనిలేదు.

నిన్నే చేసుకుంటా, బాగా చూసుకుంటా అని వేధించినట్లు తెలిపారు. నవీన్‌రెడ్డి వేధింపులు తట్టుకోలేక ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు సరిగా రెస్పాండ్‌ అవలేదని ఆరోపించారు. భద్రత కల్పించాలని కోరినా వినలేదని, పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని వైశాలి ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్తూ నవీన్‌రెడ్డి తనను విపరీతంగా, రక్తం కారేలా కొట్టాడన్నారు. నువ్వు ఇక్కడ సరిగా లేకుంటే ఇంటి దగ్గర మీ అమ్మానాన్నలను చంపేస్తామని బెదిరించాడన్నారు. నాకు నువ్వంటే ఇష్టంలేదని చెప్పినా వినలేదని... నీ ఇష్టంతో పనిలేదు, నువ్వంటే నాకి ఇష్టం.. చేసుకుంటే నేనే చేసుకోవాలి, నిన్ను ఇంకొకరిని పెళ్లి చేసుకోనివ్వను, నీ కెరీర్‌ ఇక్కడితోనే ఆగిపోవాలని అన్నాడని వైశాలి బోరున విలపించింది. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, నిజానిజాలు తేల్చాలని, తనకు న్యాయం చేయాలని వైశాలి కోరారు.

'నిందితులపై నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్లు'

డెంటల్‌ డాక్టర్‌ వైశాలి కిడ్నాప్‌ కేసులో నిందితులు జైలు పాలయ్యారు. నిందితులపై ఐపీసీ 147, 148, 307, 324, 363, 427, 506, 452, 380 r/w 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి 32మందిని అరెస్ట్‌ చేశారు. ఉదయం నుంచి ఆదిభట్ల పీఎస్‌లో హైడ్రామా నడిచింది. నిందితులు దొరికినవారిని దొరికినట్టు ఒక్కొక్కరిగా ఎస్వోటీ, పోలీసులు పీఎస్‌కు తీసుకొచ్చారు. నిందితులనుంచి వివరాలు సేకరించిన అనంతరం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చడంతో 14రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. భారీ బందోబస్తు మధ్య నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ప్రధాన నిందితుడు నవీన్‌రెడ్డి సహా పలువురు ఇంకా పరారీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టుబడ్డ నిందితులు

నాగారం భానుప్రకాశ్‌, రాథోడ్‌ సాయినాథ్‌, నాగారం కార్తీక్‌, గనోజి ప్రసాద్‌, కొత్తి హరి, రాథోడ్‌ అవినాశ్‌, అరిగెల రాజు, సోనుకుమార్‌ పాశ్వాన్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌, నీలేష్‌కుమార్‌ యాదవ్‌, బిట్టుకుమార్‌ పాశ్వాన్‌, పున్న నిఖిల్‌, ఇస్లావత్‌ అనిల్‌, మహేశ్‌కుమార్‌ యాదవ్‌, ఎండీ రిజ్వాన్‌, జావెద్‌ హుస్సేన్‌, ఎండీ ఇబారర్‌, బొడ్డుపల్లి సతీష్‌, మహ్మద్‌ ముఖ్రమ్‌, బిశ్వజిత్‌, అంగోత్‌ యోగిందర్‌, నర్ర గోపిచంద్‌, బట్టు యశ్వంత్‌రెడ్డి, ముప్పాల మహేశ్‌, వంకాయలపాటి మణిదీప్‌, బోని సిద్దు, శివరాల రమేశ్‌, మలిగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, జాదవ్‌ రాజేందర్‌, మేరసాని సాయినాథ్‌, దామెరగడ్డ శశికిరణ్‌.

'నిందితుల తల్లిదండ్రుల ఆర్తనాదాలు'

పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలో వైశాలి నిందితుల తల్లిదండ్రులు హల్‌చల్‌ చేశారు. తమ కుమారులను ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. కేవలం నవీన్‌రెడ్డితో సన్నిహితంగా ఉండటంతో, వారికి సంబంధించిన హోటళ్లలో పనిచేస్తున్న సిబ్బందిని తీసుకొచ్చి ఈ కేసులో పోలీసులు అకారణంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధిత కుటుంబానికి పరామర్శలు

వైశాలి కుటుంబ సభ్యులను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, సీపీఎం నేతలు మల్లు లక్ష్మి, కాడిగళ్ల భాస్కర్‌, డి.కిషన్‌ తదితరులు పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వైశాలి కిడ్నాప్‌ ఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఇంటి మీదికి వచ్చి దాడి చేసి కిడ్నాప్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. న్యాయం జరిగే వరకు బాదిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.

ఇవి కూడా చదవండి : కిడ్నాప్‌పై సంచలన విషయాలు వెల్లడించిన వైశాలి

Next Story