అత్యాశకు పోతే కన్నీళ్లు మిగిలే..

by Disha Web Desk 20 |
అత్యాశకు పోతే కన్నీళ్లు మిగిలే..
X

దిశ, యాచారం : ఆన్లైన్ మార్కెటింగ్ వలలో చిక్కుకుని బాధితులు విలవిల్లాడుతున్నారు. అధిక వడ్డీ వస్తుందని అత్యాశకు పోయి నిండా మునిగారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. రూ.35 కోట్లకు పైగా మోసపోయామని 50 మంది బాధితులు గురువారం యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీ కేంద్రంగా ఈ-స్టోర్ ఇండియా, కేపీడబ్ల్యూ కంపౌండ్ అనే ప్రైవేట్ వ్యాపార సంస్థలు ఆన్లైన్ మార్కెటింగ్ నిర్వహిస్తున్నాయి. లక్ష రూపాయలను ఈ స్టొర్ ఇండియా లో డిపాజిట్ చేస్తే నెలకు రూ.9 వేల చొప్పున 36 నెలల పాటు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించాయి.

రెండేళ్ల క్రితం మొదట రూ.లక్ష డిపాజిట్ చేసిన వారికి ఆరు నెలల పాటు నెలకు రూ.9 వేల చొప్పున జమ చేసి నమ్మకం సంపాదించుకున్నాయి. దీంతో అత్యాశకు పోయి జనం ఎగబడ్డారు. యాచారం గ్రామానికి చెందిన ఎండీ. సోఫియాన్, ఎండీ ఉమ్నాన్, ఎండీ ఫరోన్, మహేశ్వరం గ్రామానికి చెందిన ఎండీ సమద్, మొగిలిగిద్దకు చెందిన ఎండీ యూసుఫ్, హైదరాబాద్ కు చెందిన ఎండీ అజహర్ ఈ సంస్థను పర్యవేక్షించేవారు. జిల్లాలోని యాచారం, కందుకూరు, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాలకు చెందిన వందలాది మంది వీరి మాటలు నమ్మి ఆయా సంస్థల ఖాతాల్లో రూ. లక్షలు డిపాజిట్ చేశారు. అప్పులు చేసి, బంగారు నగలు తాకట్టు పెట్టి, బ్యాంకు ఏడు నెలలుగా వీరి ఖాతాల్లో డబ్బులు జమకావడం లేదు.

చివరకు తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 50 మందికి పైగా బాధితులు వారు ఆన్లైన్లో చెల్లించిన డిపాజిట్ పత్రాలను సీఐ లింగయ్యకు చూపించారు. ఒక్క యాచారం మండలంలోనే రూ.10 కోట్లకు పైగా డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. పిల్లల పెళ్లిళ్లకు అవసరం వస్తాయనే ఆశతో రూ. లక్షలు జమ చేశామని, పోలీసులు ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. అధిక వడ్డీ ఆశతో పలుశాఖల ఉద్యోగులు సైతం ఆన్ లైన్ మార్కెటింగ్లో పెట్టుబడులు పెట్టారు. పోలీసు, రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆర్టీసీ ఉద్యోగులు వీరిలో ఉన్నారు. కొందరు ఏకంగా రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు చెల్లించినట్లు తెలిసింది. సీఐ లింగయ్య కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed