చేప పిల్లల పంపిణీలో భారీ అవకతవకలు.. 5 లక్షలకు 2 లక్షలే

by Disha Web |
చేప పిల్లల పంపిణీలో భారీ అవకతవకలు.. 5 లక్షలకు 2 లక్షలే
X

దిశ, తలకొండపల్లి: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని మత్స్య కార్మికులను బలోపేతం చేయడానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెరువుల పూడికతీత పనులకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి, ముదిరాజు కులస్తులను ఆదుకోవడానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. కానీ కొంతమంది అధికారులు మత్స్య కార్మికులను మోసం చేస్తూ, చేప పిల్లల పంపిణీలో అవకతవకలు చేస్తున్న తీరు పట్ల ముదిరాజులు, మత్స్యకారులు చేప పిల్లలు వద్దంటూ తలకొండపల్లి లో నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని చేప పిల్లలను వదిలే సమయంలో అధికారులు తీసుకువచ్చిన ప్యాకెట్లను లెక్కించగా 1800 చేప పిల్లలకు గాను, ఒక్కో ప్యాకెట్ లో సగం కూడా లేవని ప్రభుత్వం ద్వారా 100% ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తున్న విషయంలో మత్స్యశాఖ అధికారులు, గుత్తేదారుల మధ్య దళారులు బాగుపడుతున్నారు.

ముదిరాజులకు మత్స్యకారులకు ఎలాంటి లాభం జరగడం లేదని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు రొయ్యల యాదయ్య అన్నారు. తలకొండపల్లి మండలం లో గత వారం రోజులుగా చేప పిల్లల కార్యక్రమం మొదలుపెట్టగా లక్ష చేప పిల్లల పంపిణీ చేస్తే అందులో 50 వేలు మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇదేంటని అధికారులను ప్రశ్నించడంతో మేము చేప పిల్లలు ఇవ్వము ఇష్టమున్న వారికి చెప్పుకోండి అంటూ దబాయిస్తున్నారు.

మండలంలోని 11 గ్రామాల్లో ఉన్న 35 చెరువులో 5 లక్షల 81 వేల 490 చేప పిల్లలను వదులుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.కవర్లలో చిన్న సైజులో ఉన్న చేప పిల్లలను ఎవరు లెక్కించలేరని ఇదే అదునుగా భావించిన కొంతమంది దళారీలు, అధికారులతో కుమ్మక్కై చేతివాటం ప్రదర్శిస్తూ మత్స్య కార్మికులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు 12 మంది అధికారులు ఉన్న తలకొండపల్లి మండలానికి ఏ ఒక్క అధికారి వచ్చి సంఘాల ఏర్పాటులో అవగాహన కల్పించకపోవడం విడ్డూరంగా ఉందని, ప్రభుత్వం ఆదేశాలు ఉన్న అధికారుల అలసత్వంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు.

మత్స్యశాఖలో జరుగుతున్న అవకతవకలపై స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ దృష్టికి తీసుకెళ్తామని ముదిరాజులు పేర్కొన్నారు.మత్స్య శాఖలో సంఘాల ఏర్పాటుకు డబ్బులు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా ఉన్నత అధికారులు, కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ముదిరాజులకు, మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు వెంకటయ్య, విటల్, తిరుపతయ్య, నరసింహ, కృష్ణయ్య, ప్రభాకర్, శ్రీనివాసులు, దశరథం, జంగయ్య, కుమార్, వెంకటేష్, పర్వతాలు, వివిధ మండలాల మత్స్యకార సొసైటీ సంఘం సభ్యులు, తదితరులు ఉన్నారు.

Job Notifications Latest Current Affairs 2022


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed