ఆడపిల్లని తెలిస్తే చాలు.. కడుపులోనే కాటికి! శిశువుల పాలిట శాపంగా ఆ పరీక్షలు

by Disha Web Desk 19 |
ఆడపిల్లని తెలిస్తే చాలు.. కడుపులోనే కాటికి! శిశువుల పాలిట శాపంగా ఆ పరీక్షలు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రపంచంలో ప్రతి రోజు విద్యా, వైద్యంలో మార్పులు వస్తున్నాయి.ఆ మార్పులకు అనుగుణంగా ప్రజల జీవనం సాగుతుంది. కానీ నేటికి కొన్ని విషయాల్లో ప్రజలు మూర్ఖంగానే వ్యవహరిస్తున్నారు. అందరూ సమానులని చెప్పే పదం మాటలకే పరిమితమైతుంది. ఇప్పటికీ ఇంకా ప్రజల్లో ఆడ, మగ అనే తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆడ పిల్ల అంటే భారంగానే భావించే రోజులు పోలేదని స్పష్టమైతుంది. ఇంకా ఎన్నాళ్లు ఈ దుస్థితి కొనసాగుతుందో తెలియదు. ఆడ పిల్లతో వంశం నిలబడదనే దురుద్ధేశ్యంతో స్కానింగ్ పేర్లతో ఆదిలోనే పిండాలను తొలిగించుకుంటున్న వైనం గ్రేటర్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో కనిపిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆర్ఎంపీల సహాయంతో డయాగ్నోస్టిక్ సెంటర్ల అడ్డాగా స్కానింగ్ చేస్తూ లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

కాసులకు కక్కుర్తి పడి డయాగ్నోస్టిక్ సెంటర్లు ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బయటికి డయాగ్నోస్టిక్ సెంటర్ అని చెప్పినప్పటికి అంతర్గతంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న స్కానింగ్ సెంటర్లు కాసుల కోసం కడుపులోనే శిశువును చంపేస్తున్నారు. స్కానింగ్‌లో ఆడ, మగ బిడ్డ అనే విషయాన్ని ముందుగానే నిర్ధారిస్తున్నాయి. పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిస్తే.. కన్ను తెరవక ముందే కాటికి పంపేస్తున్నారు. ఫలితంగా 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో బాలుర నిష్పత్తితో పోలిస్తే బాలికల నిష్పత్తి తక్కువగా నమోదవుతోంది. ఎప్పటికప్పుడు ఆయా సెంటర్లను తనిఖీలు నిర్వహించాల్సిన సంబంధిత అధికారులు అడిగినంత ఇస్తే చాలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు విచ్చలవిడిగి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం.

నిబంధనలకు నీళ్లు..

కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా..? శిశువు పెరుగుదల ఎలా ఉంది..? అనే అంశాలను తెలుసుకునేందుకు మాత్రమే.. అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించాలి. కడపులోని బిడ్డ ఆడో, మగో ఎట్టిపరిస్థితుల్లోనూ నిష్పత్తి చెప్పకూడదు. లింగ నిర్ధారణకు సహకరించిన వారికి 3 నెలలు జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి కూడా ఇదే తప్పు చేసిన వారికి 5 సంవత్సరాల జైలు, రూ.50 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇందులో వైద్యులు దోషులైతే వారి లైసెన్స్ను రద్దు చేస్తారు. గర్భంలోని శిశువుకు లింగనిర్ధారణ చేయమని కోరిన వారికి మూడేళ్ల జైలు, రూ.50 వేల జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నిబంధనలు సక్రమంగా కొనసాగిస్తున్నారా లేదా అనే విషయాలను వైద్యా ఆరోగ్య శాఖాధికారులు నిత్యం తనిఖీలు చేయాలి. నిబంధనలకు విరుద్దంగా నడిపించే డయాగ్నోస్టిక్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాకులు, సంబంధిత అధికారులతో కుమ్మక్కై కండ్లు తెరవనని బిడ్డలను బలిచేస్తున్నారు.

ఆర్ఎంపీల పాత్ర..

హైదరాబాద్ జిల్లాలో 1,257 స్కానింగ్ సెంటర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోగా.. వీటిలో ప్రస్తుతం 716 పని చేస్తున్నాయి. మిగిలిన వాటిలో కొన్ని మూతపడగా.. మరికొన్ని శివారు ప్రాంతాలకు తరలిపోయాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 672 ఉండగా, వీటిలో 486 పని చేస్తున్నాయి. మరో 186 డయాగ్నోస్టిక్ సెంటర్లు మూతపడ్డాయి. ప్రతి డయాగ్నోస్టిక్ కేంద్రంలో అర్హత కలిగిన రేడియాలజిస్ట్ ఉండాలి. కానీ నగరంలోని చాలా కేంద్రాల్లో లింగనిర్ధారణ చట్టంపై కనీసం అవగాహన లేని కాంపౌండర్లు, నర్సులతో పరీక్షలు చేయిస్తున్నారు. వీరు డబ్బులకు ఆశపడి పుట్టబోయేది మగ బిడ్డా.. ఆడ బిడ్డ చెబుతూ.. పరోక్షంగా అబార్షన్లకు కారణమవు తున్నారు. అత్తాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చైతన్యపురి, బీఎన్రెడ్డి, చంపాపేట్, ఎల్బీనగర్, నాగోల్, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, షాద్నగర్, ఆమనగల్లు, కల్వకుర్తిలోని పలు స్కానింగ్ సెంటర్లలో ఈ పరీక్షలు ఎక్కువగా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న కొంతమంది ఆర్ఎంపీలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

2011 జనాభా లెక్కల ప్రకారం ఆరేళ్లలోపు చిన్నారుల్లో జనాభా

జిల్లా పిల్లలు బాలురు బాలికలు నిష్ఫత్తి

హైదరాబాద్ 4,19,500 2,16,428 2,03,072 938

రంగారెడ్డి అర్భన్ 4,09,723 2,10,274 1,99,449 947



Next Story

Most Viewed