ఆర్థిక శక్తితో పాటు ఆరోగ్య శక్తి కూడా అవసరం : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

by Disha Web |
ఆర్థిక శక్తితో పాటు ఆరోగ్య శక్తి కూడా అవసరం : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
X

దిశ, శంషాబాద్ : ఆర్థికశక్తితో పాటు, ఆరోగ్య శక్తి కూడా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యూరో గైనకాలజీ, పల్మోనాలజీ, జనరల్ మెడిసిన్, హియరింగ్ స్క్రీనింగ్ కు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించి, రిపోర్టులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన దేశం శక్తివంతమైన దేశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అదే సమయంలో శక్తివంతమైన దేశం ఆరోగ్యవంతమైన దేశంగా మారుతుందని కచ్చితంగా చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒత్తిడితో కూడిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, చైతన్యరహితమైన పని విధానం, తదితర అంశాలు అనారోగ్యాలకు చేరువ చేస్తున్నాయని ఈ నేపథ్యంలో యోగ, నడక, వ్యాయామం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని తెలిపారు. అహారపు అలవాట్లు మారిపోయి, ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి వైపు వెళుతున్నారని, ఈ పరిస్థితికి చరమ గీతం పాడి భారతీయ ఆహారపు అలవాట్ల మీద దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ సేవా దృక్పథంతో రైతులు, యువత, మహిళల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ఉద్యోగ ఉపాధి రంగాల్లో దశాబ్దాలుగా స్వర్ణ భారత్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ఛైర్మన్ కామినేని శ్రీనివాస్ సహా పలువురు ట్రస్టీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.Next Story