నిజాయితీగా ప్రజలకు సేవలు అందిస్తా.. మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం.

by Disha Web Desk 20 |
నిజాయితీగా ప్రజలకు సేవలు అందిస్తా.. మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం.
X

దిశ, శంకర్పల్లి : వారసులతో నియోజకవర్గాన్ని దోచుకోవడం ఎంత వరకు సమంజసం అని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్.రత్నం అన్నారు. ఇంద్రారెడ్డి నగర్, మీర్జాగూడ, జన్వాడ గ్రామాలలో ఆదివారం పల్లెపల్లెకు రత్నం అనే కార్యక్రమంలో భాగంగా ఆయన తన అనుచరులతో కలిసి ఇంటింటికి తిరిగారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజాసమస్యల పై ఆరా తీశారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా?... రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, పెన్షన్ల గురించి వాకబు చేశారు . అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. వారసులతో నియోజకవర్గాన్ని కబ్జా చేసి దోచుకోవడం తగదని పరోక్షంగా విమర్శలు చేశారు. తన వారసులను రాజకీయాలకు దూరంగా పెట్టి, అందరికీ అవకాశాలు కల్పించినట్లు గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీఫాంలను అమ్ముకోవడం తగదని, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ల నియామకంలో అందిన కాడికి దోచుకోలేదని చురకలంటించారు.

ఇంద్రారెడ్డి శిష్యుడిగా ఆయన సూచించిన మార్గంలో నీతి, నిజాయితీ కలిగిన కార్యకర్తగా పనిచేస్తున్నట్లు తెలిపారు. నిజాయితీ గల కార్యకర్తగా పార్టీ నియమ నిబంధనలు కనుగుణంగా తాను నడుచుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే ఒకే ఒక కోరికతో వచ్చేఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి సబితమ్మ ఆశీస్సులు తనకు మెండుగా ఉన్నాయని, అదేవిధంగా ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిల దీవెన తనకే ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు తప్పకుండా తనకే టికెట్ ఇస్తారనే నమ్మకం ఉందని అన్నారు. దేవుడి దయతో పార్టీ టికెట్ తనకు వచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు పారదర్శకవంతమైన పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.

ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం రిజర్వ్ స్థానాల్లో పోటీ చేయవచ్చని తెలిపారు. వారిని గెలిపించడం ఓడించడం ప్రజల పైన ఆధారపడి ఉంటుందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ప్రజారంజకంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీర్ల నరసింహ, శంకర్పల్లి మాజీ సర్పంచ్ శ్రీధర్, మిర్జాగూడ మాజీ సర్పంచ్ పంతం సంజీవ, శంకర్పల్లి మున్సిపల్ కౌన్సిలర్ లు శ్రీనాథ్ గౌడ్, సంతోష్ రాథోడ్. రాయదుర్గం సొసైటీ వైస్ చైర్మన్ కాట్ననరసింహ, మహారాజపేట ఉపసర్పంచ్ నరసింహ చారి, చిన్న మంగళారం ఎంపీటీసీ యాదయ్య నాయకులు బయన్న, శ్రీనివాస్ రెడ్డి, రాజు, దేవయ్య, ప్రభాకర్, ప్రతాప్ రెడ్డి, దశరథ్, బీర్ల శివ, బీర్ల వెంకటేష్ , కుమ్మరి శ్రీరాములు, శెట్టి మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed