రైతులు పంట నష్టపోయినా పట్టించుకోరా:కేశంపేట్ సర్పంచ్

by Disha Web Desk 23 |
రైతులు పంట నష్టపోయినా పట్టించుకోరా:కేశంపేట్ సర్పంచ్
X

దిశ, కేశంపేట్ : నకిలీ పురుగుల మందులను వాడి రైతులు పంటలు నష్టపోతున్న వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని సంతాపూర్ సర్పంచ్ అంజయ్య మండల సర్వసభ్య సమావేశంలో వ్యవసాయ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం ఎంపీపీ వై.రవీందర్ యాదవ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు సమస్యలను సర్పంచ్లు, ఎంపిటిసిలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులను విక్రయించే సీడ్స్ షాప్ నిర్వాహకులపై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ అంజయ్య అన్నారు. విద్యుత్ సరఫరా లో తరచూ అంతరాయం కలుగుతుందని ఇప్పలపల్లి సర్పంచ్ ఆంజనేయులు , అల్వాల ఎంపిటిసి సురేష్ రెడ్డి అధికారులకు తెలిపారు. మండల కేంద్రంలో పింఛన్లు ఇవ్వడంలో సంబంధిత శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సర్పంచ్ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు .

గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు ఎంబీలు చేయడంలో పిఆర్ ఏఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని , చేసిన పనులకు బిల్లులు రాకుంటే కొత్తగా పనులేం చేయాలని సర్పంచులు వెంకట్ రెడ్డి, ఆంజనేయులు , నవీన్ కుమార్ ఎంపీపీ తో పాటు పి ఆర్ డిఈ శ్రీరాములు దృష్టికి తీసుకొని వచ్చారు. గ్రామాలలో కుక్కల బెడద ఎక్కువైందని , చిన్న పిల్లలతో పాటు పశు సంపదపై కుక్కలు దాడులు చేస్తున్నాయని పలువురు సర్పంచులు ఎంపీపీ దృష్టికి తీసుకుని వచ్చారు. కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మండలంలో ఐసిడిఎస్ అధికారుల పనితీరు బాగాలేదని , అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఎంపీపీ తో పాటు పలువురు సభ్యులు సిడిపిఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ. సమావేశంలో ప్రజా ప్రతినిధులు లేవలెత్తిన సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లను వేయడం జరిగిందన్నారు. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. రేషన్ షాపులు లేని ఆమ్లెట్ గ్రామాలు, తండాలలో రేషన్ సరుకులు అందించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాండ్ర విశాల , వైస్ ఎంపీపీ అనురాధ, సిడిపిఓ నాగమణి , తహసీల్దార్ ఆజాం అలీ , ఇన్చార్జి ఎంపిడివో రవిచంద్ర కుమార్ రెడ్డి , వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.


Next Story