వృద్ధురాలు మృతి...వైద్యులే కారణమని ఆందోళన

by Disha Web Desk 15 |
వృద్ధురాలు మృతి...వైద్యులే కారణమని ఆందోళన
X

దిశ, శంకర్పల్లి : వైద్యం వికటించి వృద్ధురాలు మృతి చెందిందని గురువారం కుటుంబీకులు, గ్రామస్తులు ఆస్పత్రి ముందు ఆందోళన నిర్వహించారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని బుల్కాపురంనకు చెందిన వృద్ధురాలు పార్వతమ్మ(60) 18న శంకర్ పల్లి లోని హైదరాబాదు రోడ్డులో ఉదయం రోడ్డు దాటుతుండగా, అనుదీప్ అనే యువకుడు మోటార్ బైక్ పై వస్తూ ఢీ కొట్టాడు. పార్వతమ్మ కాలు విరగడంతో శంకర్ పల్లిలోని మెగా ఆసుపత్రిలో చేర్పించారు. 22వ తేదీన పార్వతమ్మ కాలుకు ఆపరేషన్ జరిగింది. కాగా 23వ తేదీ బుధవారం రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు వైద్యుల నిర్లక్ష్యంతోనే పార్వతమ్మ మృతి చెందింది అంటూ ఆందోళన నిర్వహించారు. న్యాయం జరిగే వరకూ శవాన్ని తీసేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. పోలీసులు కుటుంబీకులను ఒప్పించి పోస్టుమార్టంకు తరలించారు. డాక్టర్లను వివరణ కోరగా వైద్యం చేయడంలో తమ తప్పేం లేదని, బాధితులు చేస్తున్న ఆరోపణలు అవాస్తమని తెలిపారు.


Next Story