డంపింగ్ యార్డ్ పొగ.. ఆరోగ్యానికి సెగ

by Kalyani |
డంపింగ్ యార్డ్ పొగ.. ఆరోగ్యానికి సెగ
X

దిశ, కల్వకుర్తి : గురువారం రాత్రి కల్వకుర్తి పట్టణంలోని హరిహర టౌన్‌షిప్ సమీపంలో చెత్త డంప్‌ యార్డులోని చెత్తకు నిప్పంటుకొని మంటలు లేచాయి. గురువారం మద్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు డంపింగ్ యార్డుకు నిప్పు అంటించడం వల్ల పూర్తి స్థాయిలో దగ్దమైంది. దీంతో డంపింగ్ యార్డుపై మంటలు ఎగిసిపడ్తుండడంతో రెండు రోజులుగా కల్వకుర్తి పట్టనన్ని పొగ కమ్మేసింది. చుట్టుపక్కల రెండు, మూడు కిలోమీటర్ల పరిధిలో జనం ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చెత్త దాదాపు కాలి బూడిదైంది. కానీ గ్యాస్ లీక్ కావడంతో మంటలు పెరుగుతూనే ఉన్నాయి.

మంటల ఉధృతి పెరుగుతుండటంతో ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా ఫైరింజన్లతో సిబ్బంది రెండు రోజులుగా రాత్రింబవళ్లు మంటలు ఆర్పేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావడం లేదు. అగ్నిమాపక అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చినప్పటికీ వ్యర్థాల కుప్ప నుంచి పొగలు వస్తూనే ఉన్నాయి. మారుతున్న గాలుల కారణంగా మంటలు చుట్టుపక్కల అంతటా పెరుగుతూనే ఉన్నాయి. అర్ధేకర మేర మంట‌లు విస్త‌రించ‌డంతో డంపింగ్ యార్డు ప్రాంత‌మంతా పొగ‌ కమ్ముతోంది. వ్యర్థాల్లో మండే గ్యాస్ లీకేజీ అవుతోంది. ఓ చోట మంటలు ఆర్పివేయగానే ఒక్కసారిగా మరోచోట మంటలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో ప్ర‌మాద‌క‌ర‌మైన విష వాయువులు గాలిలో క‌లుస్తున్నాయి. పైగా పొగ, దుర్వాసనతో ఇప్పటికే పలువురు పట్టణ ప్రజలు అస్వస్థతతో ఆసుపత్రి పాలైనట్టు సమాచారము.

కల్వకుర్తి డంపింగ్ యార్డులో బయో మైనింగ్ లేకపోవటం, మరో వైపు ప్రతి రోజు టన్నుల కొద్దీ చెత్త యార్డుకు వస్తుండడంతో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. యార్డులో లక్షల టన్నుల చెత్త ఉండటంతో మంటలు భారీ ఎత్తున లేచాయి. ఈ దుర్వాసనతో కల్గిన పొగ వల్ల అనారోగ్యాల‌తో చావాల్సిందేనా..? ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోరా..? కాలుష్యం కాటేస్తున్నా అధికారులకు పట్టదా అంటూ పట్టణ ప్రజలు ప్ర‌శ్నిస్తున్నారు. నిత్యం చెత్త నుంచి మంటలు రావటంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని, డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.



Next Story

Most Viewed