'ప్రైవేటు'కు రూల్స్ వర్తించవా?

by Taduka Kalyani |

ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రైవేటు పాఠశాలలు మంగళవారం కూడా తరగతులు నిర్వహించాయి.

ప్రైవేటుకు రూల్స్ వర్తించవా?
X

దిశ, గండిపేట: ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రైవేటు పాఠశాలలు మంగళవారం కూడా తరగతులు నిర్వహించాయి. వేసవి సెలవులను ఈ నెల 14వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, కొన్ని ప్రైవేటు పాఠశాలలు ముందుగానే విద్యా కార్యకలాపాలు ప్రారంభించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని రాజేంద్రనగర్, గండిపేట, శంషాబాద్ మండలాలతో పాటు నార్సింగి, మణికొండ, అల్కాపూర్ కాలనీ, అత్తాపూర్, హైదర్‌గూడ, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లోని పలు ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సర్కారు ఉత్తర్వులకు విరుద్ధంగా తరగతులు

ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15వ తేదీన పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు సోమవారం నుంచే తరగతులు ప్రారంభించాయని సమాచారం. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.

పట్టించుకోని అధికారులు

ప్రైవేటు పాఠశాలలపై పర్యవేక్షణ నిర్వహించి నిబంధనలు అమలు చేయాల్సిన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story