పేదరికం లేని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం : సీడబ్ల్యూసీ మెంబెర్ పవన్ ఖేరా

by Sumithra |
పేదరికం లేని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం : సీడబ్ల్యూసీ మెంబెర్ పవన్ ఖేరా
X

దిశ ప్రతినిధి, వికారాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూడా ఉందని, కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని సీడబ్ల్యూసీ మెంబెర్, మీడియా, పబ్లిసిటీ ఏఐసీసీ చైర్మన్ పవన్ ఖేరా కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సత్య భారతి ఫంక్షన్ హాల్ లో గత ఆదివారం సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలతో కూడిన గ్యారెంటీ కార్డులను ఏఐసీసీ చైర్మన్ పవన్ ఖేరా చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ స్వప్నన్ని సాకారం చేయడానికి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలను నెరవేర్చింది. అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని తప్ప మరో పార్టీని నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రజల శ్రేయస్సు కోరి అనేక సంక్షేమ పథకాలు తీసుకురాబోతున్నామని, అందులో ప్రధానమైన 6 గ్యారంటీలను మాత్రం గెలిచిన వెంటనే అమలు చేసేలా పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

అందులో ప్రధానంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళ అకౌంట్లో నెలకు రూ.2,500 వేయడంతో పాటు గ్యాస్ సిలిండర్ ధర రూ.500 లకు తగ్గించడం, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం అన్నారు. ఇక రెండవది రైతు భరోసా ప్రతి రైతు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15,000, వ్యవసాయ కూలీలకు రూ.12,000, వరి పంట సాగుకు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుంది. మూడవది గృహ జ్యోతి ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాము అన్నారు. నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు ఈ పథకం కింద ఇల్లు లేని పేదవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇవ్వడంతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు ఒక్కొక్క కుటుంబానికి 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. ఐదవది యువ వికాసం ఈ పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డుతో పాటు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తామని అన్నారు. ఆరవది చేయూత ఈ పథకం కింద పెన్షన్ దారులకు రూ.4,000 నెలసరి పెన్షన్ ఇవ్వడంతో పాటు, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా కల్పించి పేదరికం లేని తెలంగాణ రాష్ట్రాన్ని తయారు చేస్తామని అన్నారు.

ఎమ్మెల్యే ఆనంద్ నీ పర్సనల్ జీవితం బయట పెట్టాలా..?

ఈ సందర్భంగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వ్యవహార శైలిపై మండిపడ్డ ప్రసాద్ కుమార్, రాజకీయాలలో కేవలం రాజకీయాలు మాత్రమే చేయాలని పర్సనల్ లైఫ్ కుటుంబం జోలికి రాకూడదని హెచ్చరించారు. సమాజం గురించి ఏమాత్రం అవగాహన లేని చిల్లర బ్యాచ్ ని వేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో పిచ్చిపిచ్చి పోస్టులు పెట్టడానికి ప్రోత్సహించడం సరికాదు. మేము అనుకుంటే నీ పర్సనల్ జీవితాన్ని బయట పెట్టలేమా..? కాంగ్రెస్ పార్టీకి సంస్కారం, నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మేము గీత దాటడం లేదు. భవిష్యత్తులో ఇలాంటివి మరోసారి జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఈ సందర్భంగా మోమిన్ పేట్ మండల అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి 20 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమం అనంతరం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లిలో ఇంటింటికి తిరిగి గ్యారంటీ కార్డులను పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు ప్రభాకర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, కిషన్ నాయక్, గోవర్ధన రెడ్డి, మహిపాల్ రెడ్డి, కమల్ రెడ్డి, అయూబ్, రాంచంద్ర రెడ్డి, జాఫర్, అన్సారీ, మండల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్, శంకర్, రవీందర్, భాస్కర్ రెడ్డి, వెంకటేశం, బ్లాక్ అధ్యక్షులు అనంత్ రెడ్డి, చామల. రఘుపతి రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed