అపార్ట్మెంట్ నిర్మాణం అక్రమమా.. సక్రమమా.?

by Disha Web Desk 20 |
అపార్ట్మెంట్ నిర్మాణం అక్రమమా.. సక్రమమా.?
X

దిశ, అబ్ధుల్లాపూర్మెట్ : తమకాలనీలో నిర్మాణంలో ఉన్నఅపార్ట్మెంట్ కు సరైన విధంగా అనుమతులు లేవని, ప్లాట్లు కొనుగోలు చేసి అమాయకులు మోసపోకూడదనే కారణంతో తాము ముందుగా సూచిస్తున్నాం అంటూ ఓ కాలనీ వాసులు అధికారులను ఆశ్రయించారు. తమ కాలనీకి చెడ్డపేరు రాకుండా సోషల్ మీడియా వేదికగా ఇండ్ల నిర్మాణాల్లో ఉన్న తప్పులను చూపిస్తూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదులు అందజేశామని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు అపార్ట్మెంట్ నిర్మాణపనులను నిలిపివేశారు. స్థానికుల, కాలనీవాసుల కధనం ప్రకారం పెద్ద అంబర్పేట మున్సిపాల్టీ పరిధిలోని కుంట్లూర్ 24వ వార్డు పరిధిలోని ప్రజయ్ గుల్మోహర్ కాలనీలో సర్వే నెంబర్ 108లో కొన్ని ప్లాట్లు కోర్టుకేసుల్లో ఉంది. ఇందులో 750 గజాల చొప్పున రెండు బ్లాకులలో అపార్ట్మెంట్ నిర్మాణం కోసం హెచ్ఎండీఎ 2011లో అనుమతులు పొందారు.

నిర్మాణం చేయకుండా 2019లో ఇందులో ఓపెన్ ప్లాట్స్ అమ్మకం చేపట్టారు. అనంతరం 2022లో మళ్లీ హెచ్ఎండీఎ అనుమతులు పొందారు. అనంతరం సంబంధించిన వ్యక్తులు కాకుండా ఇతరులు ఇందులో క్రయవిక్రయాలు జరుపుతున్నారు. పైగా మార్కెట్లో లేని విధంగా అపార్ట్మెంట్ ధరలు పెట్టి అమాయకులను మోసంచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అనుమతులు పొందింది ఒకరు... నిర్మాణం చేపట్టేది మరొకరు.. విక్రయాలు చేస్తూ పత్రాల పై సంతకాలు చేసేది మరొకరు అని స్థానికుల వాదన. వీటన్నింటికి తోడు ఈ సర్వే నెంబర్ విషయం కోర్టులో ఉండగా హెచ్ఎండీఎ నుంచి ఎలా అనుమతులు పొందాలో అర్ధం కావడం లేదని, తప్పుడు పత్రాలతో అధికారులను సైతం తప్పుదోవ పట్టించి అమాయకపు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని స్థానికుల ఆరోపణ. కోర్టులో ఉన్న ప్లాట్లకు బై నెంబర్లు వేసి అనుమతులు పొందారని స్థానికులు ఆరోపించారు.

వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని కాలనీలోని పలువురు సోషల్ మీడియా వేదికగా పలుగ్రూపులలో విషయాన్నీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేసి చివరికి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో పాటు స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేశారు. విషయం తెలుసుకున్న పెద్ద అంబర్పేట మున్సిపల్ అధికారులు ఉన్నపలంగా పనులు నిలిపివేయాలని సదరు నిర్మాణదారులకు ఆదేశాలు జారిచేయడంతో పనులు నిలిచిపోయాయి. భూముల ధరలు ఎక్కువవుతుండడంతో మోసాలు సైతం ఎక్కువై ముఖ్యంగా అమాయకపు ప్రజలను మోసం ఏ విధంగా చేయాలో కొంత మంది కుట్రపన్ని మోసాలకు పాల్పడుతున్నారని, సదరు అపార్ట్మెంట్లో కొనుగొలు చేసే వారు పూర్తిగా సమాచారం తెలుసుకుని కొనుగోలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.



Next Story

Most Viewed