తెలంగాణ హోమ్ మినిష్టర్ ఎవరో చాలా మందికి తెలియదు: బండి సంజయ్

by Disha Web Desk 19 |
తెలంగాణ హోమ్ మినిష్టర్ ఎవరో చాలా మందికి తెలియదు: బండి సంజయ్
X

దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన దళిత యువకుడు నాగరాజు దారుణ హత్యను రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఖండించారు. సోమవారం నాగరాజు కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించి.. అతడి భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడి హత్యా వివరాలు, ప్రస్తుత పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కులాల పేరుతో దళిత కుటుంబాలపై దాడులు జరగడం పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డులో నాగరాజు హత్యా జరిగితే ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ స్పందించక పోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయ్యిందని పేర్కన్నారు.

రాష్ట్ర హోమ్ మినిష్టర్ ఎవ్వరో కూడా తెలియని దీన స్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. ప్రజలకే కాదు కొందరు పోలీసులకు కూడా హోమ్ మినిష్టర్ ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడిందంటే.. ఆయన పనితీరు ఎలా ఉందో అర్ధం అవుతుందన్నారు. కులాల పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం నాయకులను మెప్పించడానికే మహ్మద్ అలీని హోమ్ మినిష్టర్ కుర్చీలో నామమాత్రంగా కూర్చోబెట్టి.. మిగతా తతంగం అంత సీఎం నడిపిస్తున్నాడని చెప్పారు. మంత్రులకు స్వేచ్ఛను ఇవ్వకుండా రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తున్నాడని సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.

అలాగే కేంద్ర ఎస్సీ కమిషన్ ఛైర్మెన్ వచ్చివెళ్లిన కూడా బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయడం లేదన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఎదో రావాలి కాబట్టి వచ్చి వెళ్లారు తప్ప.. స్థానిక మంత్రి మాత్రం ఇప్పటికి నాగరాజు కుటుంబాన్ని పరామర్శించకపోవడం చూస్తేనే దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉంది అర్ధం అవుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు సదానంద్ రెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed