బాలాపూర్ వినాయకుడికి అట్టహాసంగా ప్రారంభమైన పూజలు

by Kalyani |
బాలాపూర్ వినాయకుడికి అట్టహాసంగా ప్రారంభమైన పూజలు
X

దిశ, బడంగ్ పేట్ : వినాయక చవితి పండుగ పర్వదినం సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 44 వ గణేష్ నవరాత్రి వార్షికోత్సవ వేడుకలు శనివారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సన్నాయి మేళాలు ... వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ తొలి రోజు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అసోసియేషన్ అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి బృందం మొదటి పూజలు నిర్వహించారు. ఎంతో విశిష్టత కలిగిన 21 కిలోల బాలాపూర్ గణేష్ లడ్డుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 23 ఫీట్ల వినాయక ప్రతిమ చేతిలో పెట్టారు.

పూజలు నిర్వహించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.....

బాలాపూర్ గణేష్ మండపానికి విచ్చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి తదితరులకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఘనంగా స్వాగతం పలికింది. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి , మేయర్ చిగిరింత పారిజాత నర్సింహా రెడ్డిలు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం లడ్డును ప్రసాదంగా బహుకరించారు.

ఆకట్టుకుంటున్న అయోధ్య రామమందిరం ఆకృతి మండపం ...

ఈ యేడు అయోధ్య రామమందిరం ఆకృతిలో ఏర్పాటు చేసిన బాలాపూర్ గణేష్ మండపం విశేషంగా ఆకట్టుకుంటోంది. వినాయక మండపానికి లోపలికి వెళ్ళడానికి ...బయటికి వచ్చే రెండు దారులను ఏర్పాటు చేశారు. అంతేగాకుండా మండపంలో 23 ఫీట్ల ఎత్తులో సహజసిద్ధంగా కూర్చుని ఉన్న స్థితిలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ గణేష్ విగ్రహం తలపై భాగంలో అమృతం కోసం సముద్రంలో మంధర పర్వతాన్ని దేవతలు, రాక్షసులు మధనం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దారు. కూర్చున్న ఆకృతిలో కనిపించే బొజ్జ గణపయ్య ఒక చేతిలో సింహం చిత్రాలతో కూడిన త్రిశూలం, రెండవ చేతిలో ఓంకారం, మూడవ చేతిలో గొడ్డలి, నాలుగవ చేతిలో లడ్డును పెట్టే వీలుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు.

అంతేగాకుండా ఎడమ చెవి పక్కన లక్ష్మీదేవి, కుడి చెవి పక్కన కమలంపై సరస్వతీ దేవి కనిపించే విధంగా తయారుచేసిన గణేష్​ విగ్రహం విశేషంగా ఆకట్టుకుంటోంది. తొలి రోజే వేలాది మంది భక్తులు బాలాపూర్ గణేష్ మండపాన్ని దర్శించుకున్నారు. అయోధ్య రామమందిరం అకృతిలో ఏర్పాటు చేసిన గోపురాల ముందు, బాలాపూర్ వినాయకుని ప్రతిమ ముందు భక్తులు ఎంతో ఆసక్తిగా సెల్ఫీలు తీసుకోవడం కనిపించింది. బాలాపూర్ గణేషునికి పూజలు నిర్వహించిన వారిలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కొలను శంకర్ రెడ్డి, బడంగ్ పేట్ బీఆర్ ఎస్ అధ్యక్షుడు రామిడి రాం రెడ్డి, మీర్పేట్​ అధ్యక్షుడు అర్కెల కామేష్​ రెడ్డి, కార్పొరేటర్ లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, నాయకులు వంగేటి లక్ష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాలాపూర్ ఇన్ స్పెక్టర్ తోట భూపతి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story