అద్దె భవనంలో ఇంకెన్నాళ్లు?

by Mahesh |
అద్దె భవనంలో ఇంకెన్నాళ్లు?
X

దిశ, ఇబ్రహీంపట్నం : అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిస్థితి ఉంది. రిజిస్ట్రేషన్ల ద్వారా లక్షల్లో ఆదాయం వస్తున్నా.. కార్యాలయానికి వచ్చే ప్రజలకు కనీస వసతులు లేక తిప్పలు పడుతున్నారు. కార్యాలయానికి శాశ్వత భవనం లేక అద్దె భవనంలో నిర్వహిస్తుండగా.. సరైన వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఇబ్రహీంపట్నం కలెక్టర్ కార్యాలయం, ఔటర్ రింగ్ రోడ్, ఫార్మాసిటీ లాంటివి ఉండడంతో ఇక్కడ భూములకు మంచి డిమాండ్ ఉంది. దీంతో రిజిస్ట్రేషన్లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తుంటారు. కార్యాలయానికి శాశ్వత భవనం లేకపోవడంతో అద్దె భవనంలో కార్యకలాపాలు నెట్టుకొస్తున్నారు.

అద్దె భవనంలో సరైన తాగునీటి వసతి, మూత్రశాలలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ సౌకర్యం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. కొత్త భవనం నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.1.50 కోట్ల వ్యయంతో 2022లో శంకుస్థాపన చేయగా పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఈ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వినియోగదారుల అవసరాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. దీని పై సబ్ రిజిస్ట్రార్ సంధ్యారాణిని వివరణ కోరగా ప్రతిరోజూ ఇక్కడ 30 నుంచి 35 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, కొత్త భవనం ఉంటే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. వినియోగదారుల సౌకర్యాల విషయమై సమాధానానికి నిరాకరించారు.

పార్కింగ్ లేక వాహనదారులకు తిప్పలు

రిజిస్ట్రేషన్ కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు తమ వాహనాలను ఎక్కడ పెట్టాలో అర్థం కాక రోడ్డుపై నిలుపుతున్నారు. దీంతో ఈ రోడ్డంతా ట్రాఫిక్ తో నిండిపోవడంతో ఇటువైపుగా వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. కార్యాలయానికి వచ్చిన వారికి కనీసం కూర్చోవడానికి కుర్చీలు సైతం లేకపోవడంతో గంటల తరబడి నిలబడి ఉండాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ రుసుము చార్జీలు పెంచిన ప్రభుత్వం కనీస వసతులు కల్పించకపోవడం బాధాకరం. ప్రభుత్వం వెంటనే నూతన భవనాన్ని పూర్తి చేస్తే వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.- వనం శ్రీనివాస్, ఆదిభట్ల కౌన్సిలర్



Next Story

Most Viewed