మరో ఐదు రోజులు సిటీకి వర్ష సూచన.. అప్రమత్తమైన GHMC

by Disha Web Desk 9 |
మరో ఐదు రోజులు సిటీకి వర్ష సూచన.. అప్రమత్తమైన GHMC
X

దిశ, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరంలోని వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రెండురోజుల క్రితం చల్లటి, బలమైన ఈదురుగాలులో దంచి కొట్టిన వానతో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమైన సంగతి తెల్సిందే. దీంతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని లోతట్టు, నాలా పరిహహాక ప్రాంతాలతో పాటు చెరువులకు దిగువన ఉన్న ప్రాంతాలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటున్నాయి.

ఇప్పటికైనా కోలుకున్నామని భావిస్తున్న సమయంలో మహా నగరంలో రానున్న మరో ఐదు రోజుల పాటు చిరు జల్లులు మొదలుకుని ఓ మోస్తారు వర్షాలు కురవవచ్చునని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. డీఆర్ఎఫ్ బృందాలను నిరంతరం అలర్ట్‌గా ఉండేలా ఏర్పాట్లు చేసింది. మంగళవారం రాత్రి కురిసిన వర్షం, వీచిన చల్లటి గాలుల ప్రభావంతో బుధవారం ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి.

నిన్నమొన్నటి వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగా నమోదు కాగా, బుధవారం 33 డిగ్రీలుగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలుగా నమోదయ్యాయి. ప్రతి సర్కిల్‌లో అధికారులు సిబ్బంది వాతావరణ శాఖ సూచన మేరకు మ్యాన్‌పవర్, యంత్రాలతో సిద్దంగా ఉండాలని, నీరు నిలిచిన ప్రాంతాలను గుర్తించి వెంటనే వాటిని క్లియర్ చేసేలా చర్యలు చేపట్టేందుకు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిసింది.

అకాల వర్షం..ఆపై అంధకారం

మహానగరంలో వర్షం కురిసినపుడు రోడ్లపై ప్రయాణించేందుకు వాహనదారులు జంకుతున్నారు. చిన్నపాటి వర్షానికే భారీగా వర్షపు నీరు నిలిచే మెయిన్ రోడ్లలో ఇరువైపులా ఉన్న వీది ధీపాలు పని చేయకపోవటంతో అంధకారం నెలకొంటుందని, ఈ క్రమంలో ఎక్కడ ఏ మ్యాన్ హోల్ తెరిచి ఉందోనన్న భయంతో ద్విచక్ర వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాహనాలను నడపాల్సి వస్తుంది.

ముఖ్యంగా ఆర్టీసి క్రాస్ రోడ్ నుంచి ముషీరాబాద్ చౌరస్తా వరకు, అక్కడి నుంచి ఓలిఫెంటా బ్రిడ్జి వరకు ప్రయాణం నరకంగా మారిందని వాపోతున్నారు. దీంతో పాటు ఇందిరాపార్కు నుంచి ఉస్మానియా యూనివర్శిటీ వరకు, నారాయణగూడ చౌరస్తా నుంచి కోరంటి మీదుగా అంబర్‌పేట వెళ్లే రహదారిలో కూడా అంధకారం, ఆపై రోడ్లపై గుంతలు ఉండటంతో ప్రయాణించేందుకు వాహనదారులు బేజారవుతున్నారు.

Next Story

Most Viewed