జోడో యాత్రతో ఉమ్మడి మెదక్‌లో పాతరోజులొచ్చేనా?

by Disha Web Desk 2 |
జోడో యాత్రతో ఉమ్మడి మెదక్‌లో పాతరోజులొచ్చేనా?
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: ఒకప్పుడు కంచుకోటగా వెలుగొందిన ఉమ్మడి మెదక్ జిల్లాలో తిరిగి కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయా? పార్టీ యువనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జిల్లా పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపనున్నదా? ఇంతకు పార్టీ సీనియర్ల మధ్య సమన్వయం కుదిరేనా? యాత్ర గ్రాండ్ సక్సెస్ అయ్యేనా? ఉమ్మడి మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన సాధారణ కార్యకర్తలతో పాటు పార్టీ అభిమానుల మెదడులను తొలుస్తున్న ప్రశ్నలివి. ఈ అన్ని ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలే సమాదానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. జోడో యాత్రతో వచ్చిన అద్భుత అవకాశాన్ని ఏ మేరకు వినియోగించుకుంటారు..? యాత్రను ఏ మేరకు సక్సెస్ చేస్తారు..? అందరం కలిసే ఉన్నాం అని ఏలా నమ్మకం కలిగిస్తారనేది రాజకీయంగా ఇప్పుడు ఆసక్తిగా మారింది. నవంబర్ 1 నుంచి జిల్లాలో మొదలు కానున్న రాహుల్ జోడో యాత్ర నేపథ్యంలో ఇప్పటికే పార్టీ నేతలు రెండు సార్లు సమావేశమయ్యారు. యాత్ర విజయవంతం కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు నేతలు చెబుతున్నారు.

జోడో యాత్ర బాధ్యతలు చూస్తున్న దామోదర్

ఉమ్మడి మెదక్ జిల్లాలో రాహుల్ జోడో పాదయాత్ర బాధ్యతలను పార్టీ అధిష్టానం మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు అప్పగించింది. కొద్ది రోజులుగా ఆయన యాత్రపై సీరియస్‌గా దృష్టి సారించారు. ఇప్పటికే గాంధీ భవన్లో ఏఐసీసీ పెద్దలతో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమయంలో సమావేశం జరిగింది. యాత్ర ఎలా వెళ్లనున్నది..? సభల నిర్వహణ..? ఏ ప్రాంతాల మీదుగా వెళితే బాగుంటుంది అనే అంశాలపై చర్చించారు. దామోదర రాజనరసింహ్మతో పాటు గీతారెడ్డి, జగ్గారెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్, తూంకుంట నర్సారెడ్డి, పట్లోళ్ల సంజీవరెడ్డి, తిరుపతిరెడ్డి అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ బాధ్యతులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వాల అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే రాహుల్ పాదయాత్ర జిల్లాలో ఐదు రోజుల పాటు ఉండనుండడంగా రోజు ప్రత్యేక కార్యక్రమాలు ఉండాలని నిర్ణయించుకున్నారు. కాగా ఉమ్మడి జిల్లా రాహుల్ జోడో యాత్రకు దామోదర రాజనరసింహ్మ బాధ్యుడిగా వ్యవహరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

'కాట శ్రీనివాస్'కు ప్రధాన బాధ్యతలు

రాహుల్ జోడో యాత్ర హైదరాబాద్ మీదుగా నవంబర్ 1న పటాన్ చెరు నియోజకవర్గంలో చేరనున్నది. ప్రస్తుతం పటాన్ చెరు కాంగ్రెస్ ఇన్ చార్జిగా కాట శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఆ రోజు భారీ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని పార్టీ పెద్దలు కాటకు సూచించారు. ఈ మేరకు శనివారం రామచంద్రాపురంలోని గ్రాండ్ సితారా హోటల్‌లో ఉమ్మడి జిల్లా పార్టీ నేతల సమావేశం జరిగింది. గీతారెడ్డి, జగ్గారెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్, తూంకుంట నర్సారెడ్డి, సంజీవరెడ్డిలతో పాటు ముఖ్యులంతా హాజరయ్యారు. పాదయాత్రపై గంటల పాటు చర్చించారు. మొదటి రోజు పటాన్ చెరు కావడంతో కాట శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పటించారు. మెదక్ ఎంపీగా గెలుపొందిన తరువాతే ఇందిరాగాంధీ దేశ ప్రధాని అయిన విషయం తెలిసిందే. అమె ప్రధాని అయిన తరువాతే మెదక్‌కు ఓడిఎఫ్, బీడీఎల్‌తో పాటు భారీ పరిశ్రమలు వచ్చాయి. ఇందిరా ప్రధాని ఉండగా మెదక్ జిల్లాలో జరిగిన కార్యక్రమాలు, ప్రధానంగా పరిశ్రమలకు సంబంధించిన ఫోటోలతో కూడిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతే కాకుండా పటాన్ చెరు ప్రాంతంలోని పరిశ్రమలకు సంబంధించిన కార్మిక సంఘాల నాయకులు రాహుల్‌తో మాట్లాడించే ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపారు. కాగా కాంగ్రెస్ బలోపేతానికి మంచి అవకాశంగా భావించిన కాట శ్రీనివాస్ జోడో యాత్ర జయప్రదం చేయడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలో ఐదు రోజుల పాటు జోడో యాత్ర

సంగారెడ్డి జిల్లాలో ఐదు రోజుల పాటు రాహుల్ భారత్ జోడో యాత్ర ఉండనున్నది. నవంబర్ 1న యాత్ర సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని లింగంపల్లికి చేరుకోనున్నది. యాత్ర ఇక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా ముత్తంగి వరకు చేరుకుంటుంది. ఇక్కడ బస చేసిన తరువాత 2న పటాన్ చెరు నుంచి యాత్ర తిరిగి ప్రారంభం కానున్నది. అదే రోజు యాత్ర పుల్కల్ మండలం శివ్వంపేట వరకు చేరుకునేలా ప్లాన్ ఉన్నది. ఇక నవంబర్ 3న యాత్రకు విరామం ఇచ్చారు. తిరిగి 4న సంగారెడ్డి నుంచి జోగిపేట, 5న జోగిపేట నుంచి యాత్ర మద్నూర్‌లో చేరనున్నది. అయితే జిల్లాలో అందోలు వద్ద దాదాపు 5 లక్షల మందితో భారీ స్థాయిలో బహిరంగ సభ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. దామోదర రాజనరసింహ్మ ఆద్వర్యంలో ఈ సభ ఏర్పాట్లు చేయనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా బార్డర్‌లో కామారెడ్డి జిల్లా సరిహద్దులో కూడా ఓ సభ నిర్వహణపై చర్యలు జరుగుతున్నాయి. ఆ సభపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోసారి పార్టీ శ్రేణులంతా సమావేశం అయిన తరువాత రూట్ మ్యాప్‌పై మరింత క్లారిటీ ఉంటుందని నాయకులు వెల్లడించారు.

జోడో యాత్రతో పాతరోజులొచ్చేనా?

ఇతర జిల్లాలకు లేని అవకాశం ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి జిల్లాకు వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రాహుల్ యాత్ర సంగారెడ్డి జిల్లా మీదుగానే కొనసాగుతున్నది. ప్రధానంగా పటాన్ చెరు, సంగారెడ్డి, అందోలు మూడు నియోజకవర్గాలే హైలెట్ కానున్నాయి.ఈ నియోజకవర్గాల నేతలు ఏ మేరకు యాత్రను సద్వినియోగం చేసుకోనున్నారు..? అనేది ఆసక్తిగా మారింది. జిల్లాలోని ముఖ్య నేతల మద్య సమన్వం లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది. తమ వ్యక్తి గత ప్రయోజనాల కంటే పార్టీ కార్యక్రమాల విజయవంతంపై దృష్టి సారిస్తే బాగుంటుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా మీదుగా యాత్ర వెలితే మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి ఏ మేరకు జనం తరలిరానున్నారు..? అక్కడి నేతలు ఎంత వరకు సవాల్ గా తీసుకుంటారనేది వేచి చూడాల్సి ఉన్నది. మొత్తంగా రాహుల్ పాద యాత్ర కాంగ్రెస్ నేతల రాజకీయ భవిత్యవ్యాన్ని తేల్చనున్నదని ఓ నాయకుడు చెప్పుకొచ్చారు.

Next Story