రోడ్డెక్కిన రాచకొండ గిరిజనులు.. వాళ్లకే ఓట్లేస్తామని స్పష్టం!

by Disha Web Desk 2 |
రోడ్డెక్కిన రాచకొండ గిరిజనులు.. వాళ్లకే ఓట్లేస్తామని స్పష్టం!
X

దిశ, సంస్థాన్ నారాయణపురం: రాచకొండ గిరిజన రైతులు తమ అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలంటూ గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్ రాచకొండ బాధిత రైతులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం వీరు మాట్లాడుతూ.. రాచకొండ పేద గిరిజన రైతుల అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సుమారు 70 సంవత్సరాల నుండి పట్టా పాసు పుస్తకం కలిగి ఉన్నామని, కంప్యూటర్ పహానిలో 1బీ లు కూడా ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు క్రాప్ లోన్, ఇన్పుట్ సబ్సిడీలు, రుణమాఫీ అన్ని పథకాలు వర్తింపజేశాయని, కానీ తెలంగాణ ప్రభుత్వం 2017 సంవత్సరంలో భూప్రక్షాళన కార్యక్రమంతో రాచకొండ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్లు 273, 192, 106, 85 లోని భూములను ఆన్లైన్లో కట్ చేసి పహాని రాకుండా చేసి కొత్త పాస్ బుక్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. ఆరేళ్లు గడుస్తున్నా ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ ఆఫీసుల్లో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ధరణితో మా పేదల బతుకులు మారుతాయనుకుంటే, సమస్యలు ఎక్కువయ్యాయని విమర్శించారు. గత పట్టా పాసుపుస్తకాలు కలిగిన రైతులు చనిపోయినా వారికి రైతు బీమా, రైతుబంధు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కానీ ప్రభుత్వం రైతుబంధు పేరుతో 50,100 ఎకరాలు ఉన్న భూస్వాములకు పంట పండించకపోయినా రైతుబంధు పేరుతో కొన్ని లక్షలు కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కానీ పేద రైతులు రైతుబంధు, రైతు బీమా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పండించిన పంటను మార్కెట్లో అమ్ముదామంటే కొత్త పాసుపుస్తకం ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని కొర్రీలు పెడుతున్నారని వాపోయారు. తమకున్న భూములలో సాగు చేసుకుంటూ ఉంటే ఫారెస్ట్ అధికారులు తమను వేధిస్తున్నారని అన్నారు. పాత పట్టా పాసుపుస్తకాలు చెల్లవని తమను బెదిరించి ఫైన్‌లు వేసి కేసుల పాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొత్త పట్టా పుస్తకాలు లేక తాము బతుకు ఆగమై పరిస్థితి దాపురించిందని అన్నారు. తమకు కొత్త పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించే వారికి ఓటు వేస్తామని గిరిజనులు తేల్చి చెబుతున్నారు.




Next Story

Most Viewed