కేసీఆర్ మోడల్ అంటే విధ్వంసకర మోడల్ : ప్రొఫెసర్ కోదండరాం

by Disha Web Desk 13 |
కేసీఆర్ మోడల్ అంటే విధ్వంసకర మోడల్ : ప్రొఫెసర్ కోదండరాం
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ మోడల్ అంటే విధ్వంసకర మోడల్ అని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. తెలంగాణ జన సమితి పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కాన్స్టిట్యూషన్ క్లబ్ లో 'తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన - అభివృద్ధి - వాస్తవాలు' పై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ టీఆర్ఏస్‌ను బీఆర్ఏస్ గా మార్చి దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారని, తెలంగాణా రాష్ట్రంలో ఏ సమస్యలను పూర్తిగా పరిష్కరించారని ఇవాళ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని సీఎంను ప్రశ్నించారు.


ప్రస్తుతం దేశంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరుసలో ఉందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఏళ్లుగా విడుదల కాకుండా పెండింగ్ లో ఉన్నాయని, సీఎం కేసీఆర్ పాలనలో అమలవుతున్న వ్యవసాయ విధానం గుప్పెడు మంది భూస్వాములకు లాభం చేకూరేలా ఉందని విమర్శించారు.

తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమిటని సీఎంను ప్రశ్నించారు. రిటైర్డ్ ప్రొఫెసర్, ఆర్థిక వేత్త డీఎల్ నర్సింహ్మ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బడ్జెట్ కేటాయింపులు గొప్పగా చూపించి, దానిని ఖర్చు చేయడంలో వెనక్కి వెళ్తారని విమర్శించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అజయ్ గుడవర్తి, అజిత్ ఝా, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కిరణ్ విస్సా, టీజేఏస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్, ధర్మార్జున్, బైరి రమేష్, నిజ్జన రమేష్, ఆశప్ప తదితరులు పాల్గొన్నారు.


Next Story