‘సమస్య పరిష్కరించకపోగా.. అవమానించేలా మంత్రి మాట్లాడటం సిగ్గుచేటు’

by Disha Web Desk 2 |
‘సమస్య పరిష్కరించకపోగా.. అవమానించేలా మంత్రి మాట్లాడటం సిగ్గుచేటు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. 17, 282 మంది రేషన్ డీలర్లు చేస్తున్న సమ్మెకు టీజేఏస్ పార్టీ తరపున మద్దతు తెలియజేస్తున్నామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ డీలర్లు తమ న్యాయమైన 22 డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగారని, గత కొన్ని నెలలుగా డీలర్లు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోలేదన్నారు. గత మూడు నెలల నుంచి రేషన్ డీలర్లకు రావల్సిన కమీషన్‌ను ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదని తెలిపారు. వీటిని వెంటనే చెల్లించాలన్నారు. గతంలో రేషన్ షాపుల ద్వారా 9 రకాల వస్తువులను పంపిణీ చేసేవారని, దీంతో కొంత ఎక్కువగా కమీషన్ వచ్చేదన్నారు. కానీ, నేడు ఒక బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారని, దీంతో రూ.8 వేలకు మించి కమీషన్ రావట్లేదని స్పష్టంచేశారు.

ఈ వచ్చే అరకొర కమీషన్‌లోనే డీలర్లు హమాలీ, తరుగు వచ్చే బియ్యం ఖర్చు, గోనె సంచుల ఖర్చులు భరించాల్సి వస్తుందన్నారు. దీంతో రేషన్ డీలర్లకు కనీస లాభం కూడా లేకుండా పోతుందని, రోజురోజుకూ కుటుంబ పోషణ భారంగా మారి పేదరికంలోకి జారుతున్నారని పేర్కొన్నారు. అందుకే రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని, తమిళనాడు ప్రభుత్వం తరహాలో రేషన్ డీలర్లను ప్రభుత్వం పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. వారికి గౌరవ వేతనం ఇవ్వాలన్నారు. డీలర్ల సమస్యలకు సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకుపోవాల్సిన పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ డీలర్లను అవమానించేలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. టీజేఎస్ జిల్లా కమిటీల శ్రేణులు వారికి మద్దతుగా నిలబడాలని ఆదేశాలు ఇచ్చారు. ఇకనైనా డీలర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే లేకపోతే డీలర్లతో కలిసి పార్టీ ఆధ్వర్యంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Also Read..

ఆగం చేసినోళ్లు భుజాన గొడ్డలితో తిరుగుతున్నరు: CM KCR

Next Story

Most Viewed