కాళేశ్వరం డిజైన్ లోపంపై విచారణ జరిపించాలి : ప్రొ.కోదండరామ్

by Disha Web Desk |
కాళేశ్వరం డిజైన్ లోపంపై విచారణ జరిపించాలి : ప్రొ.కోదండరామ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ లోపం వల్లే పంపులు మునిగాయని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ ఆరోపించారు. అవినీతికి ఆస్కారం కలిగేలా డిజైన్ మార్చి ప్రాజెక్టు నిర్మించడం వల్లే పంపులు మునిగిపోయాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ముంపు బాధితుల సమస్యపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 'జల విషాదాల అసమర్థ పాలకులపై రణ దీక్ష' పేరుతో నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన దీక్షకు దిగారు.

ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ డిజైన్‌పై విచారణ జరిపించాలని ఇందులో తమది తప్పు అని తేలితే చెంపలేసుకుంటామని సవాల్ చేశారు. పక్కనే ఉన్న దేవాదుల పంపులు మునగలేదని గుర్తు చేశారు. ఎక్కడో డిజన్ లోపం ఉండబట్టే కాళేశ్వరం పంపులు మునుగిపోయాయన్నారు. వరదల సమయంలో పంపులకు రక్షణగా ఉండాల్సిన రక్షణ గోడలే కొట్టుకుపోవడం డిజైన్ లోపం కాదని అంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ నీటి యాజమాన్య పద్దతుల్లో పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. గత జులై నెలలో వచ్చిన వరద కారణంగా పంట నష్టం భారీగా జరిగిందని, వరదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయారని అన్నారు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భద్రాచలంలోనూ తూతుమంత్రంగానే సహాయక చర్యలు చేపట్టారని మండిపడ్డారు. మేడిగడ్డ, మంచిర్యాలకు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని కోదండరామ్ ప్రశ్నించారు.


Next Story

Most Viewed