మెడికో ప్రీతి ఘటనకు మతం రంగు పులిమే కుట్ర: RS ప్రవీణ్ కుమార్ ఫైర్

by Disha Web Desk 19 |
మెడికో ప్రీతి ఘటనకు మతం రంగు పులిమే కుట్ర: RS ప్రవీణ్ కుమార్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రగతిభవన్‌లో కూడా పేదవర్గాలపై కనబడకుండా ర్యాగింగ్ జరుగుతుందని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన వర్గాలకు చెందిన నాయకులు, అధికారులకు అక్కడికి అనుమతి ఇవ్వకుండా అవమానిస్తూ రాజకీయంగా ర్యాగింగ్ చేస్తారని విమర్శించారు. శనివారం పంజాగుట్ట నిమ్స్ దవాఖానలో ఆర్ఎస్పీ వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నం చేసిన ప్రీతికి మతం రంగు పులిమి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే ఖబడ్దార్ అని ఆర్ఎస్పీ హెచ్చరించారు. ఇది పేద వర్గాలను, ప్రీతి కుటుంబాన్ని అవమానించడమేనన్నారు. ఇటీవల మహేంద్ర యూనివర్సిటీలో ఒక విద్యార్థిపై దాడి చేసిన తన కొడుకుని వెనుకేసుకొచ్చిన బండి సంజయ్ నేడు ప్రీతి ర్యాగింగ్ ఘటనకు మతం రంగు పులిమి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. పేద వర్గాలను అవమానానికి గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పేద వర్గాలను ఏ రంగంలో కూడా ఎదగకుండా అణిచివేస్తూ ర్యాగింగ్ పేరిట వేలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యంగా, బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో సరిపోదని, అందులో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ప్రీతికి మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్పీతో పాటు బీఎస్పీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వెంకటేష్ చౌహాన్, అరుణ క్వీన్ ఉన్నారు.

Next Story

Most Viewed