ఆ తర్వాత ప్రమాదంలోకి బీఆర్ఎస్!.. ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
ఆ తర్వాత ప్రమాదంలోకి బీఆర్ఎస్!.. ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ డైలాగ్స్ అనే చర్చ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తెలుగురాష్ట్రాల రాజకీయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని, చంద్రబాబు మరోసారి సీఎం సీటుపై కూర్చుంటారని అన్నారు. అలాగే తెలంగాణ రాజకీయంపై మాట్లాడుతూ.. నేనే బీఆర్ఎస్ కార్యకర్తను అయ్యి ఉంటే, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఉన్న పరిస్థితిపై ఖచ్చితంగా ఆందోళన చెందేవాడినని చెప్పారు. ఒకవేళ తెలంగాణలో బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడుతుందని, లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉనికి సంక్షోభంలో పడినట్టేనని వ్యాఖ్యానించారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జీవితంలో ఒకటి రెండు తప్ప ఆయన ఏ పార్టీకి వ్యూహకర్తగా ఉంటారో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే పేరు ఉంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ హ్యట్రిక్ కొడుతుందని చెప్పిన ప్రశాంత్ కిశోర్, ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి సంక్షోభంలో ఉందని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన బీఆర్ఎస్, లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తొంది. ఈ తరుణంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు పార్టీకా రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరారు. ఇందులో ఇద్దరు ఎంపీలు బీజేపీ కండువా కప్పుకోగా, వారికి బీజేపీ టికెట్లు కూడా కేటాయించింది. ఈ నేపధ్యంలో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ పని అయిపోయినట్లే అని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు పార్టీ అధినాయకత్వాన్నే గాక, బీఆర్ఎస్ నాయకుల్ని కార్యకర్తల్ని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి.



Next Story